భూసేకరణ కసరత్తు | collectors busy on land acquisition | Sakshi
Sakshi News home page

భూసేకరణ కసరత్తు

Published Wed, May 28 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

collectors busy on land acquisition

సాక్షి, ఒంగోలు: అవశేషాంధ్ర పునర్నిర్మాణ ప్రతిపాదనలపై భూసేకరణ కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా జిల్లాలో పలుచోట్ల అభివృద్ధి నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసింది.  కలెక్టర్‌కు అందిన ఆదేశాల మేరకు అవసరమైన భూములు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది మండలాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ఈ విషయాలపై కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, డీఆర్‌వో గంగాధర్ గౌడ్ పలుమార్లు సమీక్షించారు. అభివృద్ధి ప్రతిపాదనలెలా ఉన్నా, ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో భూముల గుర్తింపు చేపట్టి నివేదిక సిద్ధం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుపై ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూముల వివరాలను రెండ్రోజుల కిందట్నే కోరింది.

సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేయనున్న విద్యాసంస్థలకు మొత్తం 1100 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. వాటి ల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)కి వంద ఎకరాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)కు 200 ఎకరాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)కు మరో 200 ఎకరాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటుకు 300 ఎకరాలు అవసరం కానుంది. అదేవిధంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు 300 ఎకరాల స్థలం అవసరం.

అయితే, మండలాల్లోని గ్రామాల వారీగా భూసేకరణ, మౌలిక సదుపాయాల పరిస్థితి,    
జనసంబంధాల అందుబాటు తదితర అంశాలపై జిల్లా అధికారులు స్పష్టమైన నివేదిక తయారుచేసి పంపాల్సి ఉంది. ఇక్కడ్నుంచి సమర్పించే నివేదికల్లోని వనరుల అంశాలపై ఎటువంటి కేంద్ర విద్యాసంస్థ జిల్లాకొస్తుందనేది తేలనుంది.

 పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు..
అభివృద్ధి విస్తరణలో భాగంగా జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కనిగిరి నియోజకవర్గం, సీఎస్‌పురం మండలంలో ‘నింజా’ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్) ఏర్పాటుకు 7,590 ఎకరాల భూమి అవసరమని తేల్చారు.

అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నై వరకు కోస్టల్ కారిడార్ ప్రతిపాదనపై ఇప్పటికే భూముల సేకరణ మొదలైంది. ఉలవపాడు మండలం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి 2,135 ఎకరాలు అవసరం కాగా, కొత్తపట్నం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సుమారు 2,293 ఎకరాల స్థలం కావాలంటూ కేంద్ర ప్రతిపాదనలపై ఇప్పటికే పరిశీలనా బృందం కూడా జిల్లాకొచ్చి వెళ్లింది. కొత్తపట్నం మండలంలోని ఆలూరు, అల్లూరు, పాదర్తి గ్రామాల్లో ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ పనులు జరుగుతున్నాయి.
 
 భూ వివరాలపై నివేదిక సిద్ధం: జిల్లాలో ఇప్పటి వరకు ఏడు విడతలుగా 3,10,779 ఎకరాల అసైన్డ్ భూములను 1,62,807 మంది లబ్ధిదారులకు పంపిణీ చే శారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా అసైన్డ్, ప్రభుత్వ భూముల గుర్తింపునకు సంబంధించి రెవెన్యూ ఆర్‌ఐ, వీఆర్‌వో, వీఆర్‌ఏలు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు అనాధీన భూమి 41,308 ఎకరాలు, బంజరు భూములు 20,445 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వాగు, పోరంబోకు, చెరువు భూములు 2,40,629 ఎకరాలున్నట్లు తేల్చగా.. ప్రయివేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములను కూడా సత్వరమే స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement