తెనాలికి చెందిన విజయకుమార్ దంపతుల ఆవేదన
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్‌కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు.
కుమారుడు గిరీష్‌ను హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్‌లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్‌కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment