ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాకు వాయు‘గండం’ పొంచి ఉంది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం సాయంత్రం హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై-నాగపట్నం మధ్య శనివారం సాయంత్రం తీరం దాటుతుందని, ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావం కారణంగా శనివారం ఉదయం నుంచి వాతారణంలో మార్పు కనిపించింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నాగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటింది.
దీంతో కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఒంగోలుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని జిల్లాకు హెచ్చరికలు రావడంతో తీర ప్రాంత మండలాల్లోని అధికారులను జిల్లా యంత్రాం గం అప్రమత్తం చేసింది. మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌ఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు.