ఒంగోలు కలెక్టరేట్, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, న్యూస్‌లైన్: జిల్లాను గత నెలలో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మనుషుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. భారీ వర్షాలకు ఆదుకోవలసిన జిల్లా మంత్రి మహీధరరెడ్డి మొహం చాటేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. 26 రోజుల తరువాత బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన కేంద్ర బృందంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దానిలో కొంత కుదించారు. చివరకు కొన్నిరకాల పంటలను చూసి బాగున్నాయంటూ బృంద సభ్యులు కామెంట్ చేశారు.
కేంద్ర బృందం తీరును చూసిన రైతులు, అధికారులు విస్మయానికి గురయ్యారు. చీరాల మండలం బూర్లవారిపాలెంలో మొదలైన పర్యటన ఒంగోలులో అధికారులతో నిర్వహించిన సమీక్షతో ముగిసింది. కేంద్ర ఆంతరంగిక సంయుక్త కార్యదర్శి శంభుసింగ్ నేతృత్వంలో ఆర్‌పీ సింగ్, ఎం రమేష్‌కుమార్‌లు బృందం చీరాల, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో పర్యటించింది. చీరాల మండలం బూర్లవారిపాలెం సాయినగర్ కాలనీలో బండి ఓబులేసు అనే చేనేత కార్మికుడి ఇంటిని సందర్శించింది. మగ్గం గుంటలో నీరు నిలిచి ఉండటాన్ని గమనించింది. ఆ కార్మికుడి పేరు రాసుకొని అక్కడ నుంచి నిష్ర్కమించింది. వాస్తవానికి చీరాలలోని తోటవారిపాలెం చేనేతకాలనీ, మార్కండేయ కాలనీల్లో చేనేత గుంటల్లో నీరు నిలిచిపోయాయి.
వాటివైపు బృందం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తరువాత చీరాల - కారంచేడు రోడ్డులో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. భారీ వర్షాలకు చీరాల తరచుగా ముంపునకు గురికావడానికి కారణమైన రొంపేరు డ్రైనేజీని సందర్శించింది. కాలువ నుంచి సముద్రంలోకి వరద నీరు వెళ్లాల్సి ఉండగా, సముద్రం నుంచి పోటు వచ్చి ముంపునకు దారితీస్తోందని స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిందంతా విని అక్కడ నుంచి బృందం కారంచేడు బాట పట్టింది. కారంచేడులో భారీ వర్షాలకు వరి పూర్తిగా దెబ్బతింది. దాంతో రైతులు తిరిగి నాట్లు వేసుకున్నారు. దానిని చూసిన శంభుసింగ్ ‘విత్తే దశలో ఉందికదా.. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇవ్వడంతో పక్కనే ఉన్న అధికారులు, రైతులు విస్తుపోయారు. కారంచేడులోని కొమ్మమూరు కాలువ గండ్లను కేంద్ర బృందం పరిశీలించింది.
అక్కడ నుంచి పర్చూరు మండలంలో పర్యటించింది. పోతుకట్ల వద్ద చెరువుకు పడిన గండ్లు పరిశీలించింది. తిమ్మరాజుపాలెంలో భారీ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో రైతులు వాటిని తీసివేశారు. కొన్ని మొక్కలు అలాగే ఉంచేశారు. అవి పచ్చగా ఉండటంతో పత్తి పచ్చగా బాగుంది కదా అని మరోమారు వ్యాఖ్యానించారు. అక్కడ నుంచి ఇంకొల్లు మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. కోతకు గురైన వాగు, వంకాయలపాడులో మిర్చి పొలాలను పరిశీలించింది. అనంతరం ఒంగోలుకు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం చెరువుకట్టను సందర్శించి , నేరుగా ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకొంది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో నష్టం వివరాలను తెలుసుకుంది.
బలరాం కాలనీవైపు కన్నెత్తి చూడలేదు
ఒంగోలులో భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే కాలనీల్లో బలరాం కాలనీ ముందు వరుసలో ఉంటుంది. ఆ కాలనీని కేంద్ర బృందం సందర్శిస్తుందని షెడ్యూల్‌లో ప్రకటించారు. బృందం వస్తుండటంతో కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్డుపక్కన బ్లీచింగ్ చల్లించారు. ముంపునకు కారణమయ్యే పోతురాజు కాలువ బ్రిడ్జి వద్ద చిన్న బ్యానర్ కట్టారు. కొంతమంది అధికారులతోపాటు మీడియా కూడా బృందం కోసం ఎదురు చూసింది. అయితే కేంద్ర బృందం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది.
వచ్చారు..వెళ్లారు
Published Thu, Nov 21 2013 4:58 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
Advertisement
Advertisement