రాజకీయ ‘ఉపాధి’కి రెడీ | ready to political employment | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘ఉపాధి’కి రెడీ

Published Fri, Dec 27 2013 4:18 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

ready to political employment

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజకీయ ఉపాధికి అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు రెడీ అవుతున్నారు. చౌకధరల దుకాణాలు తమకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను జనవరి 21వ తేదీలోపు భర్తీ చేయాలని ఆర్డీఓలకు కలెక్టర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల వారీగా ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాల జాబితాలను వారు తయారు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ వారికి దుకాణాలు కేటాయించుకునేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

జిల్లాలో ఇప్పటికే 2107 చౌకధరల రెడీ దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్‌లో 924, కందుకూరు డివిజన్‌లో 751, మార్కాపురం డివిజన్‌లో 432 ఉన్నాయి. ప్రస్తుతం ఒంగోలు డివిజన్‌లో 52, కందుకూరు డివిజన్‌లో 83, మార్కాపురం డివిజన్‌లో 17 చౌకధరల దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 152 దుకాణాలు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
 ఇప్పుడలా కాదు!
 గతంలో డీలర్ల నియామకాలకు సంబంధించి క్లియర్ వేకెంట్ ఉంటే పక్షం రోజుల్లో భర్తీ చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఖాళీలు అంత తొందరగా భర్తీ కావడం లేదు. సమీపంలోని డీలర్‌కు ఖాళీగా ఉన్న దుకాణం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమకు నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందడం లేదని కార్డుదారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తాము ఎప్పుడు వెళ్లినా దుకాణాలకు తాళాలు వేసే ఉంటున్నాయని కొంతమంది గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 152 చౌకధరల దుకాణాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని కలెక్టర్ విజయకుమార్ ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 చౌకధరల దుకాణాల నిర్వహణపై గతంలో పెద్దగా ఆదాయం ఉండేది కాదు. ఇటీవల కాలంలో ఇవి మంచి ఆదాయ వనరులుగా మారాయి. దీంతో ఎక్కువ మంది ఈ దుకాణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతోఎమ్మెల్యేలు కూడా చౌకధరల దుకాణాల భర్తీ విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి తమను కనిపెట్టుకుని ఉన్న వారికి దుకాణాలు కేటాయించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుయాయుల జాబితాలు అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 సొమ్ము చేసుకునేందుకు సిద్ధం
 చౌకధరల దుకాణాల ద్వారా సొమ్ము చేసుకునేందుకు కొంతమంది ఇప్పటి నుంచే వెంపర్లాడుతున్నారు. గతంలో బియ్యం వంటి కొన్నిరకాల వస్తువులకే చౌకధరల దుకాణాలు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది వాటిపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం వాటికి కేటాయింపులు పెరగడం..అక్రమార్కులకు ఈ దుకాణాలు కాసుల వర్షం కురిపిస్తుండటం.. గమనించిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయడులు ఈ సారి ఆ దుకాణాలు తమకు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. తమ కళ్లెదుటే ఆర్థికంగా ఎదుగుతున్న కొంతమంది డీలర్లను చూసి వారు కూడా అదేవిధంగా ఎదగాలని ఆరాట పడుతున్నారు.

 చౌకధరల దుకాణాలకు కేటాయించే బియ్యానికి బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కిలో రూపాయి బియ్యానికి పాలిష్ పెట్టించి బయట మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్న వారి వివరాలు తెసుకుంటూ తాము కూడా తాము కూడా అలాగే చెయ్యాలని ఆశపడుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా.. అని అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement