గడపగడపకు వైఎస్సార్ దిగ్విజయం
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెల్లడి
- ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా 9న జిల్లా కేంద్రాల్లో ధర్నా
- ప్రకాశం జిల్లా ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఐదు నెలల పాటు నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువ లక్ష్యాన్ని చేరుకున్నామని పార్టీ నేతలు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రెండు రోజులుగా జరిగిన సమీక్షలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తీరుతెన్నులపై 13 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో జగన్ సమీక్షిం చారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పార్టీనేతలు అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకొచ్చారని, వాటిపై ఎలా పోరాడాలి అనే విషయంలో నేతలకు తమ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మంగళవారం ఉమ్మారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమీక్షలో గ్రామాల్లో పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు పురోగతిపై చర్చించారన్నారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో నూతన కమిటీల ఏర్పాటుకు పేర్లు సూచించాల్సిందిగా జగన్ చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. గడపగడపకు కార్యక్రమం 92 శాతం మేరకు జరిగిందని, పార్టీ నాయకులు పట్టుదలతో అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించారని, అలాంటి వారిని జగన్ అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన వారిని ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు.
ఆరోగ్యశ్రీకి సుస్తీ..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసిందని.. చివరికి డయాలసిస్ కూడా చేయలేకపోతున్నారని, కేన్సర్ రోగుల విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతుండటాన్ని తమ నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 9న ధర్నా చేపట్టాలని పార్టీ నిర్ణరుుంచినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారని ఉమ్మారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని టీపీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగా అంత బావుంటే, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేరుుంచి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.
అంబేడ్కర్‌కు ఘన నివాళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 61వ వర్ధంతి సందర్భంగా కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు ఘనంగా నివాళి అర్పించారని ఉమ్మారెడ్డి తెలిపారు.
జయలలితకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి
జయలలిత మృతికి సంతాపంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారని ఉమ్మారెడ్డి తెలిపారు. జయ మృతిపై వైఎస్ జగన్ స్పందిస్తూ దేశం మంచి నాయకురాల్ని కోల్పోరుుందని, ఆమె మరణించడం బాధాకరమన్నారని చెప్పారు.