ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఇళ్లకు చేరాల్సి ఉన్నా వాటి జాడే లేకపోవడంతో పేదల కడుపులు కాలిపోతున్నాయి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో స్పష్టంగా తెలియకపోవడంతో బయట మార్కెట్‌లో వందల రూపాయలు వెచ్చించి బియ్యం, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పస్తులతో బతుకు బండి లాగిస్తున్నారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి దిగారు. వారితో పాటు హమాలీలు కూడా సమ్మె బాట పట్టారు. దీంతో సెప్టెంబర్‌కు సంబంధించి చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గోదాముల్లో నిత్యావసరాలు నిండుగా ఉన్నా వాటిని తరలించే హమాలీలు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 8 లక్షల 55 వేల 439 కుటుంబాలు చౌకధరల దుకాణాల నుంచి బియ్యంతో పాటు నిత్యావసరాలకు దూరమయ్యారు. జిల్లాలో 2100 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 55 వేల 439 తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా కిలో రూపాయి బియ్యం 12 వేల టన్నులు సరఫరా చేస్తారు.
ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లో 9 వేల టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. చౌకధరల దుకాణాదారులంతా నిత్యావసరాలకు సంబంధించిన డీడీలు తీసి సిద్ధంగా ఉంచుకున్నారు. గోడౌన్ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం, ఇతర సరుకులు తరలించేవారే కరువయ్యారు. సకలం సమ్మెలో ఉండటంతో సంబంధిత అధికారులు సైతం ఏమి చేయాలో పాలుపోక చేతులెత్తేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి నిత్యావసరాలు పూర్తిగా పంపిణీ చేయాల్సి ఉన్నా పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో అనేక పాఠశాలలు మూతపడ్డాయి. అమృత హస్తం పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. పథకం ప్రారంభించిన సమయంలో అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా కాకపోవడంతో కొంతమంది కార్యకర్తలు ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి కొన్ని రోజులు నిర్వహించారు. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండటంతో వారు చేతులెత్తేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినట్లయింది.
‘అమ్మహస్తం’కు అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి అవస్థలు వచ్చిపడ్డాయి. 185 రూపాయలకే 9 రకాల నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి పంపిణీ ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభించింది. అమ్మహస్తం ద్వారా అందించే నిత్యావసరాలు నాసిరకంగా ఉన్నా కొన్ని వర్గాలకు చెందినవారు వాటిని వినియోగించుకుంటూనే ఉన్నారు. నిరవధిక సమ్మె ప్రభావం అమ్మహస్తంపై పడింది.
నేటి నుంచి సరఫరా చేస్తాం : పౌరసరఫరాల సంస్థ డీఎం
చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలు ఈ నెల 8వ తేదీ నుంచి సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం ఉదయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పేదలకు అందించే బియ్యం సరఫరా నిలిచిపోయిన విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆదివారం నుంచి నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా సిబ్బంది పాల్గొనేలా చూస్తామని ఉదయభాస్కర్ వివరించారు.
ఆకలి కేకలు
Published Sun, Sep 8 2013 5:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement