రేషన్ బియ్యం కోటా పెంపు! | rice quota hiked in telangana | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం కోటా పెంపు!

Published Wed, Oct 1 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

రేషన్ బియ్యం కోటా పెంపు!

రేషన్ బియ్యం కోటా పెంపు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటాని పెంచాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున ఇస్తున్న బియ్యాన్ని 5 కేజీలకు పెంచేందుకు, కుటుంబానికి గరిష్టంగా ఉన్న పరిమితిని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న ప్రభుత్వం.. ఈ ధరను మూడు లేదా ఐదు రూపాయలకు పెంచాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. మూడు రూపాయలకు పెంచాలని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడుతుండగా, రూ.5కు పెంచినా ఇబ్బందులు ఉండవని మరికొందరు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం సచివాలయంలో భేటీ అయిన సబ్ కమిటీ ఈ అంశమై చర్చించింది. మంత్రి రాజేందర్ సహా కమిటీ సభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, మహేం దర్‌రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. మరో ఇద్దరు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథితో పాటు మరికొందరు అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
 
  దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో బియ్యం కోటా పెంపు, ప్రభుత్వంపై పడే భారం, రేషన్ ధర పెంపుతో ప్రజలపై పడే భారం తదితరాలపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం రేషన్ కార్డుల ఏరివేత ద్వారా సాధించిన మిగులు బియ్యం కోటా, దీని ద్వారా బడ్జెట్ ఆదాపై అధికారులు కమిటీకి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం పంపిణీ జరుగుతోందని, కోటా పెంచితే అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరముంటుందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ, కార్డుల ఏరివేత తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ నెలలోనే రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తామని, ఈ నెలాఖరుకి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాను 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచడం, అలాగే ధరను కూడా పెంచే విషయంపై చర్చిస్తున్నామన్నారు. దీనిపై దసరా తర్వాత మరోమారు సమావేశమై నివేదికను రూపొందించి సీఎంకు నివేదిస్తామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారన్న విషయాన్ని గుర్తుచేయగా... అన్ని కోణాల్లో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
 
 కేసీఆర్ ఫొటోతో గులాబీ కార్డులు
 
 ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులను ఇచ్చేందుకు సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. గులాబీ రంగుతోనే అన్ని రకాల కార్డులను జారీ చేయనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉన్న తెలుపు, గులాబీ కార్డులను పూర్తిగా తొలగించి, కేవలం గులాబీ రంగులోనే అన్ని కార్డులను జారీ చేసి, వాటిపై ఏపీఎల్, బీపీఎల్ కుటుంబం అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. అలాగే కార్డు ముఖచిత్రంగా తెలంగాణ  రాజముద్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. దసరా, దీపావళి మధ్య ఈ కొత్త కార్డుల జారీ ఉంటుందని సీఎం పదేపదే చెబుతున్న నేపథ్యంలో... ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో వీటిని అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement