rice quota
-
రేషన్ బియ్యం కోటా పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటాని పెంచాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున ఇస్తున్న బియ్యాన్ని 5 కేజీలకు పెంచేందుకు, కుటుంబానికి గరిష్టంగా ఉన్న పరిమితిని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న ప్రభుత్వం.. ఈ ధరను మూడు లేదా ఐదు రూపాయలకు పెంచాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. మూడు రూపాయలకు పెంచాలని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడుతుండగా, రూ.5కు పెంచినా ఇబ్బందులు ఉండవని మరికొందరు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం సచివాలయంలో భేటీ అయిన సబ్ కమిటీ ఈ అంశమై చర్చించింది. మంత్రి రాజేందర్ సహా కమిటీ సభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, మహేం దర్‌రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. మరో ఇద్దరు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథితో పాటు మరికొందరు అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో బియ్యం కోటా పెంపు, ప్రభుత్వంపై పడే భారం, రేషన్ ధర పెంపుతో ప్రజలపై పడే భారం తదితరాలపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం రేషన్ కార్డుల ఏరివేత ద్వారా సాధించిన మిగులు బియ్యం కోటా, దీని ద్వారా బడ్జెట్ ఆదాపై అధికారులు కమిటీకి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం పంపిణీ జరుగుతోందని, కోటా పెంచితే అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరముంటుందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ, కార్డుల ఏరివేత తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ నెలలోనే రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తామని, ఈ నెలాఖరుకి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాను 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచడం, అలాగే ధరను కూడా పెంచే విషయంపై చర్చిస్తున్నామన్నారు. దీనిపై దసరా తర్వాత మరోమారు సమావేశమై నివేదికను రూపొందించి సీఎంకు నివేదిస్తామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారన్న విషయాన్ని గుర్తుచేయగా... అన్ని కోణాల్లో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ ఫొటోతో గులాబీ కార్డులు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులను ఇచ్చేందుకు సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. గులాబీ రంగుతోనే అన్ని రకాల కార్డులను జారీ చేయనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉన్న తెలుపు, గులాబీ కార్డులను పూర్తిగా తొలగించి, కేవలం గులాబీ రంగులోనే అన్ని కార్డులను జారీ చేసి, వాటిపై ఏపీఎల్, బీపీఎల్ కుటుంబం అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. అలాగే కార్డు ముఖచిత్రంగా తెలంగాణ రాజముద్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. దసరా, దీపావళి మధ్య ఈ కొత్త కార్డుల జారీ ఉంటుందని సీఎం పదేపదే చెబుతున్న నేపథ్యంలో... ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో వీటిని అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఆకలి కేకలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఇళ్లకు చేరాల్సి ఉన్నా వాటి జాడే లేకపోవడంతో పేదల కడుపులు కాలిపోతున్నాయి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో స్పష్టంగా తెలియకపోవడంతో బయట మార్కెట్లో వందల రూపాయలు వెచ్చించి బియ్యం, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పస్తులతో బతుకు బండి లాగిస్తున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి దిగారు. వారితో పాటు హమాలీలు కూడా సమ్మె బాట పట్టారు. దీంతో సెప్టెంబర్‌కు సంబంధించి చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గోదాముల్లో నిత్యావసరాలు నిండుగా ఉన్నా వాటిని తరలించే హమాలీలు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 8 లక్షల 55 వేల 439 కుటుంబాలు చౌకధరల దుకాణాల నుంచి బియ్యంతో పాటు నిత్యావసరాలకు దూరమయ్యారు. జిల్లాలో 2100 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 55 వేల 439 తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా కిలో రూపాయి బియ్యం 12 వేల టన్నులు సరఫరా చేస్తారు. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ గోడౌన్లో 9 వేల టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. చౌకధరల దుకాణాదారులంతా నిత్యావసరాలకు సంబంధించిన డీడీలు తీసి సిద్ధంగా ఉంచుకున్నారు. గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం, ఇతర సరుకులు తరలించేవారే కరువయ్యారు. సకలం సమ్మెలో ఉండటంతో సంబంధిత అధికారులు సైతం ఏమి చేయాలో పాలుపోక చేతులెత్తేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి నిత్యావసరాలు పూర్తిగా పంపిణీ చేయాల్సి ఉన్నా పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో అనేక పాఠశాలలు మూతపడ్డాయి. అమృత హస్తం పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. పథకం ప్రారంభించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా కాకపోవడంతో కొంతమంది కార్యకర్తలు ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి కొన్ని రోజులు నిర్వహించారు. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండటంతో వారు చేతులెత్తేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగడంతో అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినట్లయింది. ‘అమ్మహస్తం’కు అవస్థలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి అవస్థలు వచ్చిపడ్డాయి. 185 రూపాయలకే 9 రకాల నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి పంపిణీ ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభించింది. అమ్మహస్తం ద్వారా అందించే నిత్యావసరాలు నాసిరకంగా ఉన్నా కొన్ని వర్గాలకు చెందినవారు వాటిని వినియోగించుకుంటూనే ఉన్నారు. నిరవధిక సమ్మె ప్రభావం అమ్మహస్తంపై పడింది. నేటి నుంచి సరఫరా చేస్తాం : పౌరసరఫరాల సంస్థ డీఎం చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలు ఈ నెల 8వ తేదీ నుంచి సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం ఉదయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పేదలకు అందించే బియ్యం సరఫరా నిలిచిపోయిన విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆదివారం నుంచి నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా సిబ్బంది పాల్గొనేలా చూస్తామని ఉదయభాస్కర్ వివరించారు. -
బియ్యానికి భరోసా
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే రేషన్ సరకులకు ఇబ్బందులు తప్పాయి. ఉధృతంగా కొనసాగుతున్న సమైక్య సమ్మె వల్ల సెప్టెంబరు కోటా సరకుల పంపిణీకి ఇబ్బందులు తప్పవని భావించినా చివరకు ఆటంకాలు తొలగాయి. తొలుత రేషన్ డీలర్ల నుంచి సమ్మె సెగ తగులుతుందనే భయంతో అధికారులు కంగారుపడ్డారు. కానీ సరకుల పంపిణీకి సహకరించడానికి ముందుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో సమ్మె మరింత ఉధృతం అయ్యేలోగా జిల్లాలో ఎక్కడికక్కడ బియ్యం పంపిణీ పూర్తి చేయించడానికి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అమ్మహస్తం సంచులను కార్డుదారులకు అందించనున్నారు. జిల్లాకు ప్రతి నెలా తెల్ల బియ్యం కోటా కింద 1500 టన్నుల బియ్యం అవసరం. నెల రోజులకుపైగా జరుగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల బియ్యం కోటా ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. చాలామంది కార్డుదారులు సైతం సరకులు విడిపించుకోలేదు. ఈ నేపథ్యంలో చాలావరకు సరకు మిగిలిపోయింది. దీనికి తోడు సెప్టెంబరు కోటా బియ్యం తొలి విడతగా విడుదలైన బియ్యంతో ప్రసుత్తం పలు గోడౌన్లలో 750 టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మిగిలిన సరకు చేతికి వచ్చేలోపు వీటిని కార్డుదారులకు సరఫరాచేయాలని అధికారులు నిర్ణయించారు. సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపించడంతో రెండురోజుల నుంచి అధికారులు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కట్టించుకోవడం మొదలుపెట్టారు. మరో రెండు రోజుల్లో మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం వాహనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల బియ్యం తరలించే వాహనాలను ఆందోళనకారులు అడ్డగిస్తుండడంతో సరకు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటికే పలుజిల్లాలో ఇటువంటి పరిస్థితులు సంభవించడంతో జిల్లాలో ఆ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాలను అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే వాహనాలకు కొంతవరకు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నారు. మరోపక్క జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పౌరసరఫరాశాఖ అధికారులు ఎక్కడికక్కడ మండలాలకు బియ్యం సకాలంలో చేరేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు తెల్ల బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత అమ్మ హస్తం సంచులు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల కార్డుల ప్రకారం జిల్లాకు 10.84 లక్షల సంచులు అవసరం. వీటిలో మొత్తం అన్నీ ఒకేసారి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అందులో సగమైనా జిల్లాకు రప్పించి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు.