వైబ్రేటింగ్ లేకుండానే సీసీ పనులు | CC raod works without vibrator | Sakshi
Sakshi News home page

వైబ్రేటింగ్ లేకుండానే సీసీ పనులు

Published Fri, Jan 10 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

CC raod works without vibrator

మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్: మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను వైబ్రేటింగ్ లేకుండానే కానిచ్చేస్తున్నట్టు గురువారం అధికారుల పరిశీలనలో తేలింది. నార్లాపూర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బయ్యక్కపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 11వందల మీటర్ల పొడవునా రూ.64లక్షలతో సీసీరోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా కందకాలు తవ్వి మొరం పోసి దానిపై వెట్‌మిక్స్ పోసి పనులు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ మాత్రం నామమాత్రంగా పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఒకవైపు వెట్‌మిక్స్ పోస్తూనే మరోవైపు సీసీ వేసే పనులు చేపట్టారు.

 అయితే  వైబ్రేటింగ్ లేకుండానే సీసీ పోస్తున్న విషయాన్ని గురువారం పనుల పరిశీలనకు వచ్చిన పీఆర్ అధికారులు గమనించి వెంటనే పనులను నిలిపివేయించారు. వైబ్రేటింగ్ చేసిన తర్వాతే పనులు తిరిగి చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మేడారంలో చేస్తున్న అభివృద్ధి పనుల్లో చాలావరకు ఇలాగే జరుగుతున్నాయని, ఇప్పుడు అధికారులు పరిశీలించడంతో విషయం బయటపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతర సమీపిస్తుండడంతో ఏదోరకంగా పనులు పూర్తిచేస్తే చాలనుకుని నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 పూర్తయిన కాల్వపల్లి-బయ్యక్కపేట రోడ్డు  
 కాల్వపల్లి రోడ్డు నుంచి బయ్యక్కపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.   పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 756 మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.46 లక్షల నిధులు మంజూరయ్యాయి.
 33శాతం ఎక్సస్‌తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టిన 15 రోజుల్లోనే సీసీ రోడ్డు నిర్మించడం గమనార్హం. రోడ్డును సకాలంలోనే పూర్తిచేసినా దాని నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు పూర్తయిన అనంతరం దానిని గడ్డి, ఇసుకతో కప్పివేయడంతో రోడ్డును పరిశీలించే అవకాశం అధికారులకు లేకుండాపోయింది.

Advertisement

పోల్

Advertisement