పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి
కర్నూలు:
కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. దసరా, బక్రీద్ పండుగల నేపథ్యంలో సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ వర్గాల మత పెద్దలతో ఎస్పీ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శివసేన జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ విఠల్‌శెట్టి, జమాతె ఇస్లామ్ ఎ హింద్ జిల్లా కార్యదర్శి ఎస్.హమీద్, ఆవాజ్ కమిటీ కార్యదర్శి ఇక్బాల్ హుసేన్, ముక్తియార్‌తో పాటు హిందూ, ముస్లిం మత పెద్దలు పలువురు సమావేశానికి హాజరై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు పర్వదినాల సందర్భంగా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా మత పెద్దలు సహకరించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో గోవధ చేయరాదన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నందున అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు గస్తీని ముమ్మరం చేశామన్నారు. నాల్గవ తేదిన నిర్వహించే అమ్మవారి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఓఎస్‌డీ మనోహర్‌రావు, ఏఎస్పీ ఎస్.బాబురావు,తదితరులు పాల్గొన్నారు.