
బలమైన ప్రతిపక్షంగా నిలుస్తాం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ప్రజల పక్షాన నిలిచి వారి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, అనిల్ యాదవ్, తిప్పేస్వామి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కడప నగరంలోని జయరాజ్ గార్డెన్స్‌లో ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి వారు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబులాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసపుచ్చలేక పోయారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఓటమి చెందడానికి గల కారణాలను అన్వేషించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక అందజేస్తామన్నారు. అలాగే గెలిచిన స్థానాల్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా.. అని తెలుసుకుంటున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఈ సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ నెల 11,12 తేదీలలో అనంతపురంలో రాయలసీమ జిల్లాల పరిస్థితులపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సమీక్ష జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు కోట్లాదిరూపాయలు ఎదజల్లి, ఎర్రచందనం స్మగ్లర్లను కలుపుకుని ప్రలోభాలకు గురిచేశారన్నారు. రాజంపేటలో తమ అభ్యర్థి ఓటమిపాలైనా నైతిక విజయం మాత్రం తమదేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి, తమ ఓటమికి తేడా 1.90 శాతం ఓట్లేనన్నారు.అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ లోపలా, బయటా పోరాడుతుందన్నారు. కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మనోభావాలు తెలుసుకొని పార్టీ పునర్నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. వలసలను ప్రోత్సహించడానికి టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. విప్‌ను కాదని వేళ్లే వారిపై అనర్హత వేటు తప్పక పడుతుందని హెచ్చరించారు. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి తన స్వార్థం కోసం, వ్యాపార ప్రయోజనాలను ఆశించి పార్టీ ఫిరాయించారన్నారు. ఆయనకు ప్రజలే బుద్ధిచెబుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ పనిచేసింది
రైతు రుణమాఫీ హామీతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్స్‌లో ఆదివారం నియోజకవర్గాలవారీగా సమీక్ష నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా సుదీర్ఘ చర్చ, విశ్లేషణ చేశారు. టీడీపీ అభ్యర్థులు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ఆ స్థాయిలో మనం ఖర్చు చేయలేక పోయామని పలువురు నాయకులు చెప్పినట్లు తెలిసింది. రాజంపేటలో టీడీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో కలిసి కోట్లాదిరూపాయలు ఖర్చు చేశారన్నారు.
ఎన్నికలకు ముందు ఇలాంటి సమీక్షలు నిర్వహించి ఉంటే కొంత ఉపయోగం ఉండేదన్నారు. సమీక్షలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవ గుడి నారాయణరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.