తెలంగాణలోని పది జిల్లాలను మాట, ఆట, పాటలతో కదిలించిన ఘనత మెతుకుసీమది. ప్రపంచ దృష్టిని గాంధేయ ఉద్యమంతో ఆకర్షించిన విశిష్టత ఈ నేల తల్లిది.
సిద్దిపేట టౌన్/ సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: తెలంగాణలోని పది జిల్లాలను మాట, ఆట, పాటలతో కదిలించిన ఘనత మెతుకుసీమది. ప్రపంచ దృష్టిని గాంధేయ ఉద్యమంతో ఆకర్షించిన విశిష్టత ఈ నేల తల్లిది. చట్టసభల్లో తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటి పాలకులచే రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చేయించిన పోరు ఈ గడ్డది. తెలంగాణకు నడిబొడ్డున ఉన్న ఈ జిల్లా దశ దిశల తన ఖ్యాతిని చాటుకుంది. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ కేంద్రంగా వర్ధిల్లి లక్ష్యాన్ని ముద్దాడిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట మండలం చింతమడక గ్రామ ముద్దుబిడ్డ.
1984 నుంచి సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసి తెలంగాణ గోసను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ 2001లో శాసనసభ ఉప సభపతి పదవిని, ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా విసిరేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుంబిగించిన యోధుడు. విభిన్న దశల్లో ఆయనకు సిద్దిపేట అండదండగా నిలిచింది. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించి బాసటగా నిలిచింది. 2009 అక్టోబర్ 23న సిద్దిపేటలో నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల గర్జన బహిరంగ సభ ఆరుతున్న ఉద్యమాన్ని జ్వలింపజేసింది. 2009లో సిద్దిపేటలో కేసీఆర్ సంకల్పించిన ఆమరణ దీక్ష ఢిల్లీని కదిలించింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటనను చేయించింది. ములుగు వద్ద ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యూహాలు పదునెక్కాయి.
ఉద్యమాన్ని ఉప్పెన చేసిన కలాలు, గళాలు
‘పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ గర్జించిన గద్దర్ మెదక్ జిల్లా తుప్రాన్ నుంచి చెలరేగిన పాటల తుఫాన్. నాగేటి సాలల్లో నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ.. అంటూ పాటల పరవళ్లను తొక్కించి ఉద్యమాన్ని మాట, పాటలతో పోటెత్తించిన డాక్టర్ నందిని సిధారెడ్డి తెలంగాణవ్యాప్తంగా సభల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌కు సూచనలు ఇచ్చారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట, ఆట, పాటలతో మేథావుల ను, విద్యార్థులను, ప్రజలను తెలంగాణవ్యాప్తంగా వేలాది సభల ద్వారా కదిలించి ఆలోచింపజేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉర్రూతలుగించిన ధూంధాం సిద్దిపేటలోనే పురుడుపోసుకుంది. దీని రూపకర్త రసమయి బాలకిషన్ ప్రస్థానం సిద్దిపేట నుంచి ప్రారంభమైంది. వీరులారా వందనం.. అమరులారా వందనం.. పాటను రాసిన దరువు ఎల్లన్న సిద్దిపేట కళాశాల విద్యార్థి.
పోరాట వీరుల కార్ఖాన..
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేవీ రమణాచారి, మలి దశ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషిస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, టీఎన్జీవో సారథి దేవీప్రసాద్, రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ తదితరులను మెతుకుసీమ రూపుదిద్దింది. మంజీర రచయితల సంఘం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొట్టమొదటి తీర్మానం చేసి క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొనడంతోపాటు తెలంగాణ నలుమూలల నుంచి కవులు, రచయితలు, కళాకారులను ఒకచోట చేర్చి తెలంగాణ రచయితల వేదికకు సిద్దిపేట అంకురార్పణ చేసింది.