అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు
తాత్కాలిక వసతికి భవనాలు పరిశీలించిన డీఈవో
అనకాపల్లి: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా విద్యా శాఖాధికారి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక సర్దుబాటు కింద కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉడ్‌పేట ఎలిమెంటరీ, భీమునిగుమ్మం అంబేద్కర్ హైస్కూల్ భవనాలు పరిశీలించారు. క్షేత్ర స్థాయి స్థితిగతుల్ని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సుమారు 200 సీట్లతో అనకాపల్లి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు సూచన ప్రాయంగా చెప్పారు. శాశ్వత భవనాల కోసం సుందరయ్యపేట పంచాయతీ పరిధిలోని 10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ యంత్రాంగం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు
జిల్లాలో 268 పరీక్షా కేంద్రాల్లో 11 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు డీఈవో చెప్పారు. వీటిలో 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, రావికమతం, అరకు, నర్సీపట్నం, విశాఖ అర్బన్ సెంటర్లలో సీసీ కెమెరాలు, మిగిలిన ఐదు కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు సిటింగ్ స్క్వాడ్‌లను నియమిస్తున్నామన్నారు. 3,215 మంది ఇన్విజిలేటర్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు.