Central College
-
స్నేహితుని కోసం కూలీలయ్యారు!
సాక్షి, ఒంగోలు: స్థానిక కేంద్రియ విద్యాలయం స్కూలులో పదో తరగతి అభ్యసిస్తున్నవారు స్నేహితునికి సహాయం చేసేందుకు కూలీల్లా మారారు. ఆర్టీసీ కార్గో సర్వీసులో పార్సిళ్లు మోసి కొంతమొత్తం సేకరించి అతనికి ఇచ్చారు. అసలేమయిందంటే.. గత నెల 15వ తేదీ వారి స్నేహితుడు స్థానిక అగ్రహారం గేటు సమీప నివాసి దాసరి విఘ్నేష్‌బాబు ఉన్నట్లుండి ఇంట్లోనే పక్షవాతానికి గురయ్యాడు. బాబు తండ్రి ఆటోడ్రైవర్ అశోక్. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆసుపత్రులకు తిప్పాడు. చివరకు విజయవాడలో చూపించాలనడంతో ఆంధ్రా హాస్పిటల్లో చూపించారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.35 వేల వరకు ఉంటుండటంతో తీవ్ర ఇబ్బందులను ఆ కుటుంబం ఎదుర్కోక తప్పలేదు. ఈ విషయం విఘ్నేష్ బాబు స్నేహితులకు తెలిసిపోయింది. దీంతో వారు పాఠశాలలో ఈ విషయంపై చర్చించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్పందించారు. తమవంతుగా రూ.500 వంతున, విద్యార్థులు తలా వంద మొదలు రూ.500 వరకు విరాళం వసూలుచేసి వచ్చిన మొత్తాన్ని స్నేహితుని కుటుంబానికి పంపారు. కానీ ఆ మొత్తం ఒక ఇంజెక్షన్‌కు కూడా పనికిరాదని నిర్ధారించుకున్నారు. మరో వైపు ఆరోగ్యశ్రీలో ఈ అనారోగ్యం లేని పరిస్థితి. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో కుటుంబం కొంత కుదుటపడింది. శనివారం కొంత కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. మరలా సోమవారం తీసుకురమ్మని సూచించారు. దీంతో విఘ్నేష్ స్నేహితులు అంతా ఒకటయ్యారు. డబ్బు కోసం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించి ఆర్టీసీలో కార్గో వద్దకు వచ్చి తామంతా పనిచేస్తాం.. మాకు కూలి ఇవ్వండి. అది తమ స్నేహితునికి పంపుతాం అంటూ చెప్పుకొచ్చారు. విద్యార్థులకు విరాళం అందిస్తున్న ఆర్టీసీ కండక్టర్ ఆవుల రాధాకృష్ణ ఇది అక్కడ ఉన్న కార్గో ఉద్యోగి, కండక్టర్, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాధాకృష్ణ గమనించారు. ఎటువంటి పనివద్దని తాను రూ. 5 వేలు ఇస్తానని.. దానిని మీ స్నేహితునికి ఇవ్వండని సూచించాడు. అందుకు చిన్నారులు ససేమిరా అన్నారు. ఏదైనా పని ఉంటే ఇస్తేనే తీసుకుంటామంటూ పట్టుపట్టారు. దీంతో వారిని ఆరీ్టసీలో కార్గో సర్వీసులో కొంత సేపు సేవలకు వినియోగించుకుని రూ. 5వే లు ఆవుల రాధాకృష్ణ అందించారు. స్నేహితుని ఆరోగ్యం కోసం రాఘవేంద్ర, సంజయ్, మధు, అల్తాఫ్, కౌషిక్, పీటర్, శ్యామ్, అనిల్, అజయ్‌లు పడుతున్న తపనను చూసి అంతా సంతోషించారు. -
స్కూలు ఆవరణలో కూలిన భారీ వృక్షం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం ఆవరణలోని ఓ పెద్ద చెట్టు శనివారం ఉదయం కూలిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. ఆవరణలోని ఒక పెద్ద చెట్టు ఆకస్మాత్తుగా కూలి అక్కడే ఉన్న కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, పాఠశాలకు సెలవు దినం కావటంతో అక్కడ విద్యార్థులెవరూ లేరు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. -
అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు తాత్కాలిక వసతికి భవనాలు పరిశీలించిన డీఈవో అనకాపల్లి: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా విద్యా శాఖాధికారి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక సర్దుబాటు కింద కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉడ్‌పేట ఎలిమెంటరీ, భీమునిగుమ్మం అంబేద్కర్ హైస్కూల్ భవనాలు పరిశీలించారు. క్షేత్ర స్థాయి స్థితిగతుల్ని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సుమారు 200 సీట్లతో అనకాపల్లి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు సూచన ప్రాయంగా చెప్పారు. శాశ్వత భవనాల కోసం సుందరయ్యపేట పంచాయతీ పరిధిలోని 10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ యంత్రాంగం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో 268 పరీక్షా కేంద్రాల్లో 11 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు డీఈవో చెప్పారు. వీటిలో 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, రావికమతం, అరకు, నర్సీపట్నం, విశాఖ అర్బన్ సెంటర్లలో సీసీ కెమెరాలు, మిగిలిన ఐదు కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు సిటింగ్ స్క్వాడ్లను నియమిస్తున్నామన్నారు. 3,215 మంది ఇన్విజిలేటర్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు. -
గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్
ఎల్బీ స్టేడియం: జేఎఫ్హెచ్ఏ ఇంటర్ స్కూల్స్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యాలయం (కేవీ) హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. హాకీ ఒలింపియన్ జూడ్ ఫెలిక్స్ హాకీ అకాడ మీ(జెఎఫ్హెచ్ఏ) ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో గచ్చిబౌలి కేవీఎస్ జట్టు 4-0 స్కోరుతో జేఎఫ్హెచ్ఏ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో రాహుల్ దాస్ బెస్ట్ ప్లేయర్‌గా, సూర్య ప్రకాష్ బెస్ట్ ఫార్వర్డ్ ఆటగాడిగా అవార్డును అందుకున్నాడు. ఎం.ఎ.ఎస్.కుషాల్ ప్రతాప్, విశ్వజిత్ శుక్లాలు మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెల్చుకోగా, నజీబుల్లా బెస్ట్ గోల్ కీపర్‌గా ఎంపికయ్యాడు. -
వద్దే వద్దు
చిత్ర పరిశ్రమ బంద్ సంపూర్ణం రాష్ర్ట వ్యాప్తంగా థియేటర్ల మూత పలుచోట్ల ‘డబ్బింగ్ భూతం’ దిష్టిబొమ్మల దహనం బెంగళూరులో భారీ ర్యాలీ రాజ్‌కుమార్ సమాధి నుంచి సెంట్రల్ కాలేజీ వరకు ప్రదర్శన హాజరైన అగ్ర తారాగణం బెంగళూరు, న్యూస్‌లైన్ : అనువాద (డబ్బింగ్) చిత్రాలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జయప్రదమైంది. సినీ తారలతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఒకే తాటిపై నిలిచి డబ్బింగ్ సినిమాలు వద్దే వద్దని నినదించాయి. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. నగరంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా తొలుత బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సెంట్రల్ కాలేజీ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అగ్ర తారాగణం సహా చిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమకు డబ్బింగ్ చిత్రాలు అవసరం లేదని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు నిర్మాతలు స్వార్థంతో డబ్బింగ్ చిత్రాల పాట పాడుతున్నారని ఆరోపించారు. అదే జరిగితే కన్నడ చిత్ర పరిశ్రమ వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస వరకు డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈగ ఫేం సుదీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో డబ్బింగ్ చిత్రాలు వస్తే కన్నడ చిత్ర పరిశ్రమ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తాము ఏ భాషా చిత్రాలకూ వ్యతిరేకం కాదని అన్నారు. డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా సుదీర్ఘ కాలం పోరాటం చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. డబ్బింగ్ సినిమాలు కావాలంటున్న వారికి కన్నడిగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన కన్నడ చళువళి వాటాల్ పక్షం అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ మాట్లాడుతూ డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ సంస్కృతి దెబ్బ తింటుందని హెచ్చరించారు. కన్నడ భాష, సంస్కృతులను కాపాడుకోవాలంటే డబ్బింగ్ చిత్రాలకు అవకాశం కల్పించకూడదని తెలిపారు. దీనిపై కన్నడిగులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కన్నడ అభివృద్ది ప్రాధికార అధ్యక్షుడు, నటుడు ముఖ్యమంత్రి చంద్రు మాట్లాడుతూ డబ్బింగ్ భూతం వల్ల కన్నడ చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. ఇదే సందర్భంలో నటీ నటులు జగ్గేష్, తార, నవీన్ కృష్ణ, ప్రేమ్, వినోద్ రాజ్, సాధు కోకిల, మాలాశ్రీ, సుధారాణి, శృతి, భావన, రాధిక పండిత్, అలనాటి నటీమణులు భారతి విష్ణువర్ధన్, లీలావతి, ప్రేమా చౌదరి, ప్రమీళ జోషాయ్, డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు శివరామే గౌడ, ప్రవీణ్ కుమార్‌శెట్టి, కన్నడ సేన కుమార్, దళిత సంఘం నాయకుడు మూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా నగరంలో అనేక చోట్ల కన్నడ సంఘాలు ‘డబ్బింగ్ భూతం’ దిష్టి బొమ్మలను దహనం చేశాయి.