కార్గోలో పనిచేస్తున్న పదో తరగతి విద్యార్థులు
సాక్షి, ఒంగోలు: స్థానిక కేంద్రియ విద్యాలయం స్కూలులో పదో తరగతి అభ్యసిస్తున్నవారు స్నేహితునికి సహాయం చేసేందుకు కూలీల్లా మారారు. ఆర్టీసీ కార్గో సర్వీసులో పార్సిళ్లు మోసి కొంతమొత్తం సేకరించి అతనికి ఇచ్చారు. అసలేమయిందంటే.. గత నెల 15వ తేదీ వారి స్నేహితుడు స్థానిక అగ్రహారం గేటు సమీప నివాసి దాసరి విఘ్నేష్‌బాబు ఉన్నట్లుండి ఇంట్లోనే పక్షవాతానికి గురయ్యాడు. బాబు తండ్రి ఆటోడ్రైవర్ అశోక్. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆసుపత్రులకు తిప్పాడు. చివరకు విజయవాడలో చూపించాలనడంతో ఆంధ్రా హాస్పిటల్‌లో చూపించారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.35 వేల వరకు ఉంటుండటంతో తీవ్ర ఇబ్బందులను ఆ కుటుంబం ఎదుర్కోక తప్పలేదు. ఈ విషయం విఘ్నేష్ బాబు స్నేహితులకు తెలిసిపోయింది. దీంతో వారు పాఠశాలలో ఈ విషయంపై చర్చించారు.
ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్పందించారు. తమవంతుగా రూ.500 వంతున, విద్యార్థులు తలా వంద మొదలు రూ.500 వరకు విరాళం వసూలుచేసి వచ్చిన మొత్తాన్ని స్నేహితుని కుటుంబానికి పంపారు. కానీ ఆ మొత్తం ఒక ఇంజెక్షన్‌కు కూడా పనికిరాదని నిర్ధారించుకున్నారు. మరో వైపు ఆరోగ్యశ్రీలో ఈ అనారోగ్యం లేని పరిస్థితి. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో కుటుంబం కొంత కుదుటపడింది. శనివారం కొంత కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. మరలా సోమవారం తీసుకురమ్మని సూచించారు. దీంతో విఘ్నేష్ స్నేహితులు అంతా ఒకటయ్యారు. డబ్బు కోసం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించి ఆర్టీసీలో కార్గో వద్దకు వచ్చి తామంతా పనిచేస్తాం.. మాకు కూలి ఇవ్వండి. అది తమ స్నేహితునికి పంపుతాం అంటూ చెప్పుకొచ్చారు.
విద్యార్థులకు విరాళం అందిస్తున్న ఆర్టీసీ కండక్టర్ ఆవుల రాధాకృష్ణ
ఇది అక్కడ ఉన్న కార్గో ఉద్యోగి, కండక్టర్, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాధాకృష్ణ గమనించారు. ఎటువంటి పనివద్దని తాను రూ. 5 వేలు ఇస్తానని.. దానిని మీ స్నేహితునికి ఇవ్వండని సూచించాడు. అందుకు చిన్నారులు ససేమిరా అన్నారు. ఏదైనా పని ఉంటే ఇస్తేనే తీసుకుంటామంటూ పట్టుపట్టారు. దీంతో వారిని ఆరీ్టసీలో కార్గో సర్వీసులో కొంత సేపు సేవలకు వినియోగించుకుని రూ. 5వే లు ఆవుల రాధాకృష్ణ అందించారు. స్నేహితుని ఆరోగ్యం కోసం రాఘవేంద్ర, సంజయ్, మధు, అల్తాఫ్, కౌషిక్, పీటర్, శ్యామ్, అనిల్, అజయ్‌లు పడుతున్న తపనను చూసి అంతా సంతోషించారు.
Comments
Please login to add a commentAdd a comment