విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది వాగ్వాదం
ఎచ్చెర్ల : ఆకతాయిల అల్లరి నేపథ్యంలో రాజాం నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ బస్సును ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ముందు బుధవారం నిలిపి వేశారు. ప్రస్తుతం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం పరీక్ష కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఈ బస్సులో ఎక్కారు. అయితే రాజాం, పొందూరు రోడ్డులో బస్సులో సీట్లు నిండిపోయి ప్రయాణికులు నిలుచోని ప్రయాణానికి మాత్రమే వెసులుబాటు ఉంది. అయితే విద్యార్థులు బస్సు లోపలికి వెళ్లకుండా ఫుట్ పాత్‌పై వేలాడుతున్నారు.
దీంతో డ్రైవర్, కండక్టర్ వేలాడవద్దని లోపలకు రావాలని సూచించారు. విద్యార్థులు తాము లోపలికి రామని ఇలాగే ప్రయాణిస్తామని వారితో వాగ్వాదానికి దిగారు. ఇలాగైతే ప్రమాదమని కండక్టర్ చెప్పినా విద్యార్థులు ఖాతరు చేయలేదు. దీంతో డ్రైవర్, విద్యార్థులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై బస్సును డ్రైవర్ నిలిపి వేశారు. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యం చేసుకొని బస్సు దిగాలని విద్యార్థులకు సూచించారు. దీంతో విద్యార్థులు తమది తప్పేనని, రెండు గంటలకు పరీక్ష కేంద్రంలో ఉండాలని తెలిపారు. దీంతో పోలీసులు వారిని హెచ్చరించి వదిలేశారు.