హా...ర్టీసీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరం, శివారు ప్రాంతాల్లోని విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసమే కాదు... బస్సులు పట్టుకోవడానికి... వాటిలో సీట్లు సంపాదించడానికి కూడా పోటీ పడాల్సి వస్తోంది. పది కిలోమీటర్ల దూరమైనా...రెండు గంటలు ముందు బయలుదేరనిదే సకాలంలో తరగతులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విద్యార్థుల సంఖ్యకు తగిన స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడమే. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం ఒక సవాల్‌గా మారింది. వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం శివార్లలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు వెళ్తుండగా వాళ్ల కోసం కనీస సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి బస్సుల్లోనే విద్యార్థులు ప్రమాదపుటంచుల్లో పయనిస్తున్నారు.
ఫుట్‌బోర్డులు, టాప్‌లపై పయనిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడుపుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ మార్గంలో నిత్యం 30 వేల మందికి పైగా విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. వారిలో 24 వేల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కలిపి 101 బస్సులు మాత్రమే ఈ మార్గాల్లో నడుస్తున్నాయి.
ఇవి కేవలం విద్యార్థుల కోసం నడిపేవే కాదు. అన్ని వర్గాల ప్రయాణికులను అనుమతిస్తారు. దీంతో ప్రయాణం ప్రమాదకరంగానే ఉంటుంది. నగరంలోని అన్ని రూట్లలో ఇదే పరిస్థితి. పరుగెత్తే బస్సులను అందుకొనేందుకు విఫలయత్నం చేస్తూ ఏటా వందలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులవుతున్నారు. అమ్మాయిలు సైతం ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి.
* నగర శివార్లలో 500కు పైగా ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కళాశాలల్లో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 2.5 లక్షల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి పాస్‌లు తీసుకున్నారు. అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి.
* 9 ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ 771 బస్సులు నడుపుతోంది. మొత్తం 7,459 ట్రిప్పులు నడుపుతున్నట్లు చెబుతున్నారు. కానీ విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా ఉంటున్నాయా అన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు.
ఇదీ ప్రమాదాల సంఖ్య...
► ఎల్‌బీనగర్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు: 30, క్షతగాత్రులు : 50 మంది
► పేట్‌బషీరాబాద్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు
► 88 రోడ్డు ప్రమాదాలు జరిగితే 29 మంది మరణించారు. వారిలో విద్యార్థుల
► సంఖ్య 12గా పోలీసులు చెబుతున్నారు.
► దుండిగల్ పరిధిలో 93 రోడ్డు ప్రమాదాల్లో 48 మంది మృతి చెందగా...
► వారిలో 15 మంది విద్యార్థులు ఉన్నారు.
► జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన 66 రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు.
► వారిలో నలుగురు విద్యార్థులు.
► గతంలో ప్రమాదాల నివారణకు బస్ స్టాపులలో నియమించిన
► హోంగార్డులను ఇటీవల తొలగించారు.