- చిత్ర పరిశ్రమ బంద్ సంపూర్ణం
- రాష్ర్ట వ్యాప్తంగా థియేటర్ల మూత
- పలుచోట్ల ‘డబ్బింగ్ భూతం’ దిష్టిబొమ్మల దహనం
- బెంగళూరులో భారీ ర్యాలీ
- రాజ్‌కుమార్ సమాధి నుంచి సెంట్రల్ కాలేజీ వరకు ప్రదర్శన
- హాజరైన అగ్ర తారాగణం
బెంగళూరు, న్యూస్‌లైన్ : అనువాద (డబ్బింగ్) చిత్రాలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జయప్రదమైంది. సినీ తారలతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఒకే తాటిపై నిలిచి డబ్బింగ్ సినిమాలు వద్దే వద్దని నినదించాయి. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. నగరంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా తొలుత బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సెంట్రల్ కాలేజీ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.
అగ్ర తారాగణం సహా చిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమకు డబ్బింగ్ చిత్రాలు అవసరం లేదని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు నిర్మాతలు స్వార్థంతో డబ్బింగ్ చిత్రాల పాట పాడుతున్నారని ఆరోపించారు. అదే జరిగితే కన్నడ చిత్ర పరిశ్రమ వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస వరకు డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈగ ఫేం సుదీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో డబ్బింగ్ చిత్రాలు వస్తే కన్నడ చిత్ర పరిశ్రమ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తాము ఏ భాషా చిత్రాలకూ వ్యతిరేకం కాదని అన్నారు. డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా సుదీర్ఘ కాలం పోరాటం చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. డబ్బింగ్ సినిమాలు కావాలంటున్న వారికి కన్నడిగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన కన్నడ చళువళి వాటాల్ పక్షం అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ మాట్లాడుతూ డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ సంస్కృతి దెబ్బ తింటుందని హెచ్చరించారు. కన్నడ భాష, సంస్కృతులను కాపాడుకోవాలంటే డబ్బింగ్ చిత్రాలకు అవకాశం కల్పించకూడదని తెలిపారు. దీనిపై కన్నడిగులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కన్నడ అభివృద్ది ప్రాధికార అధ్యక్షుడు, నటుడు ముఖ్యమంత్రి చంద్రు మాట్లాడుతూ డబ్బింగ్ భూతం వల్ల కన్నడ చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు.
ఇదే సందర్భంలో నటీ నటులు జగ్గేష్, తార, నవీన్ కృష్ణ, ప్రేమ్, వినోద్ రాజ్, సాధు కోకిల, మాలాశ్రీ, సుధారాణి, శృతి, భావన, రాధిక పండిత్, అలనాటి నటీమణులు భారతి విష్ణువర్ధన్, లీలావతి, ప్రేమా చౌదరి, ప్రమీళ జోషాయ్, డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు శివరామే గౌడ, ప్రవీణ్ కుమార్‌శెట్టి, కన్నడ సేన కుమార్, దళిత సంఘం నాయకుడు మూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా నగరంలో అనేక చోట్ల కన్నడ సంఘాలు ‘డబ్బింగ్ భూతం’ దిష్టి బొమ్మలను దహనం చేశాయి.