చిత్తూరును రెడ్ జిల్లాగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు త్వరగా,ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి ఏడు జిల్లాలు ఉండగా చిత్తూరు కూడా జాబితాలోఉండటం జిల్లా వాసులను కలవరపెడుతోంది.
చిత్తూరు అర్బన్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా గత నెల 20వ తేదీ నుంచి జిల్లాలో ఆంక్ష లు అమలవుతున్నాయి. మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించగా జిల్లా వాసులు సైతం ఇందులో పాల్గొని నిబద్ధతను చాటుకున్నారు. 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కూడా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్, ఎస్పీలు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే క్రమంగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలు నడుచుకోవాల్సిన తీరును గుర్తుచేస్తోంది.
కేసులు ఇలా..
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయగృహ నిర్బంధంలో ఉండకపోవడం, కొందరు విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులకు చెప్పకపోవడంతో జిల్లాలో కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తున్నాయి. మార్చి 24న శ్రీకాళహస్తిలో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి స్వీయగృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. దాని తర్వాత క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం జిల్లాలో 17కు చేరుకున్నాయి. ఇందులో తిరుపతిలో అత్యధికంగా 5, శ్రీకాళహస్తి 3, రేణిగుంట 2, పలమనేరు 3, ఏర్పేడు 1, నగరి 2, నిండ్రలో ఒక కేసు నమోదయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు..
♦ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలసిన వారిని క్వారంటైన్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
♦ రెడ్ జిల్లాల పరిధిలో హాట్‌స్పాట్లను గుర్తించి, వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలి. అవసరమైతే జిల్లా పరిధిలో లాక్‌డౌన్ ఆంక్షలను మరికొన్ని గంటలు పొడిగించాలి. రెడ్ జిల్లాల పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను సిద్ధం చేయాలి.
జాగ్రత్త లేకుంటే కష్టమే..
♦ కొందరు అవసరం లేకున్నా పిల్లలను, ఇంట్లోవాళ్లను స్కూటర్‌లో ఎక్కించుకుని రోడ్లు చూపిస్తూ ఆనందపడుతున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి రాకూడదు.
♦ నిత్యావసర వస్తువుల కోసం ఇంటి నుంచి ఒక్కరు వస్తే సరిపోతుంది. అది కూడా గంటలో ఇంటికి చేరుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి.
♦ ఇంట్లో బోర్ కొడుతోందని చేలల్లో క్రికెట్ ఆడటం, పెద్దలు కాలనీల్లో కూర్చుని పాచికలు ఆడటం, కొందరు యువకులు ఫ్రెండ్స్‌తో కూర్చుని పేకాట ఆడటం లాంటి దృశ్యాలు సామాజిక మాధ్యమా ల్లో దర్శనమిస్తున్నా యి. ఇలాంటి చర్యల వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
♦ ఎంత చెబుతున్నా కొందరు ఇప్పటికీ ప్రార్థనా మందిరాలకు గుంపులుగా వెళుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదయాన్నే 4 గంటలకు, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రార్థనా మందిరాలకు వెళుతున్నారు. పొరపాటున అక్కడకు వెళ్లే ఒక్కరికి పాజిటివ్ కేసు వచ్చినా చేయనితప్పునకు ఊరంతా శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment