పోర్టు అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రానికి సూచించాం
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి
రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు
గాంధీనగర్ : ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. జింఖానా మైదానంలో విజయవాడ కమల భేరి సభ శనివారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ర్టం విడిపోయిన తర్వాత అందరూ బాధపడ్డారన్నారు. సమైక్య రాష్ట్రంగా ఉండగా యాభై ఎనిమిది సంవత్సరాల పాటు ఒక్క కేంద్ర విద్యా సంస్థ కూడా రాష్ట్రానికి దక్కలేదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లో 7 కేంద్రీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. మరో నాలుగేళ్లలో ఇంకో నాలుగు కేంద్రీయ విద్యాసంస్థలు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతామన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతంలో 14 ఓడరేవులుండగా కేవలం నాలుగు మాత్రమే పనిచే స్తున్నాయని చెప్పారు. వీటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామన్నారు.
విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు రాష్ట్రానికి 2,500 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, ఎన్టీటీపీసీ ద్వారా మరో 4,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో కొరతను అధిగమించేందుకు 6,500 మెగావాట్ల ఉత్పాదకశక్తి కలిగిన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు చెప్పారు. పాలనా పరంగా అనేక మార్పులు రావాలన్నారు. ఏపీలో 13 జిల్లాలను 25 జిల్లాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశాన్ని బంగారు భారత్‌గాను, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సోము వీర్రాజు, లక్ష్మీపతిరాజు, నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన గాదె బాలాజీ..
పారిశ్రామిక వేత్త గాదె బాలాజీ కంభంపాటి హరిబాబు సమక్షంలో తన అనుచరులతో పార్టీలో చేరారు. అనంతరం విజయవాడ నగరంలో 115 సభ్యత్వాలు చేర్చిన అంధుడు నాగరాజును పార్టీ అధ్యక్షుడు హరిబాబు ఘనంగా సత్కరించారు.
ఏపీని కేంద్రం ఆదుకుంటుంది
Published Sun, Jan 25 2015 1:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement