
వెనకుంటే వెన్నుపోటు పొడుస్తారు!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
నెల్లూరు (అర్బన్): ‘నా వెనుక ఎవరూ ఉండొద్దు.. ఎందుకంటే 1984లో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీరామారావుకి వెన్నుపోటు పొడిచారు. అప్పటినుంచి నాకు అనుమానమే. అందుకే ముందు ఉండాలి..’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభం, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్, ఇండోర్ స్టేడియంలకు శంకుస్థాపన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
‘ఎవరైనా సరే నా ముందు ఉంటే నేను ధైర్యంగా ఉండొచ్చు..’ అంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.3.25 లక్షల కోట్లను ఖర్చుచేసేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారన్నారు.