అనంతపురం: అనంతపురంలో చైన్స్నాచర్లు శుక్రవారం హల్చల్ సృష్టించారు. వినాయకచవిత పర్వదినాన్ని పురస్కరించుకుని గుడికి వచ్చే భక్తురాళ్లే లక్ష్యంగా చేసుకుని చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని వేర్వేరు ప్రదేశాలలో 8 మంది మహిళలపై చైన్ స్నాచర్లు దాడి చేసి వారి మెడల్లోని బంగారు ఆభరణాలను తెంచుకుని వెళ్లారు. దాంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను చైన్ స్నాచర్లు దొంగిలించారని పోలీసులు తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
అలాగే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో రాయల్హంపీ లాడ్జిపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా లాడ్జిలో పేకాడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 92 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. లాడ్జిలో పేకాడుతున్నట్లు పోలీసులకు ఆగంతకుడు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఆ లాడ్జిపై దాడి చేశారు.