మంత్రి పల్లె ఓ నియంత : మున్సిపల్ చైర్మన్
► పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గంగన్న ధ్వజం
పుట్టపర్తి టౌన్: మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పీసీ గంగన్న ధ్వజమెత్తారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మంత్రిపై మండిపడ్డారు. మంత్రి పల్లె ప్రొటోకాల్‌కు ఏ మాత్రం విలువ ఇవ్వడంలేదన్నారు. ఆదివారం పట్టణంలో మున్సిపాలిటీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రహదారుల భూమి పూజకు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో తాను ఎదగకుండా అడుగడుగునా మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రతి వార్డులో రెండు మూడు గ్రూపులుగా విభజించి అనుకూలమైన వారి ద్వారా పనులకు బిల్లులు కాకుండా లోకాయుక్తకు ఫిర్యాదు చేయిస్తున్నారని, బిల్లులు చెల్లించకుండా అధికారులను సస్పెండ్ చేయిస్తానని మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు.
రూ.60 లక్షలు ఖర్చు చేసి మున్సిపాలిటీలో పార్టీని గెలిపించానని మంత్రి ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఆయన ఒక్కో కౌన్సిలర్‌కు లక్ష రూపాయల చొప్పున 16 మందికి మాత్రమే ఇచ్చారని, బీసీ సామాజిక వర్గంతోపాటు తన కృషి మూలంగానే టీడీపీ గెలిచిందన్నారు. మంత్రి వ్యవహార శైలిపై త్వరలోనే సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరాంనాయక్, పార్టీ నాయకులు రాజప్ప, గంగాద్రి, పోతన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.