బాబువి అవకాశవాద రాజకీయాలు
► మాదిగల్ని వాడుకుని వదిలేశారు
► టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్
చిత్తూరు (రూరల్) : మనుషుల్ని వాడుకుని వదిలేయడం, నమ్మినవాళ్లకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ ఆరోపించారు. ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగలను వాడుకున్న ఆయన తీరా సీఎం కుర్చీ ఎక్కాక వారిని మరచిపోయి, మరో వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయం గేటు వద్ద ధర్నా చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.
నరేంద్ర మాదిగ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మార్పీఎస్ బాబుకు అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు పాదయాత్రను ప్రతిపక్షాలు అడ్డుకుంటే తాము విజయవంతం చేసేందుకు నడుం బిగించామన్నారు. అప్పుడు నల్ల కండువాలను కప్పుకుని ఎమ్మార్పీఎస్ అండదండలతో ఓట్లు దండుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో తమకు హామీలు ఇచ్చి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు చేస్తున్న పనులను ప్రజలు గుర్తిస్తున్నారని, వారే టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై ఊసెత్తలేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి ఎమ్మార్పీఎస్ చేపడుతున్న న్యాయపోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. చంద్రబాబు కులా ల మధ్య చిచ్చురేపుతూ, కుల వ్యవస్థ పేరుతో ప్రజలను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. సంతలో బర్రెలను కొన్నట్లు ప్రతిపక్ష నాయకులను కొంటున్నారని, వారికి ఏదో రకంగా అధికారాన్ని కట్టబెడుతూ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.
పోలీ సులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసి పోలీస్టేషనుకు తరలించారు. కొందరు నాయకులు, కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎండలో నేల మీద పడుకుని నినాదాలు చేశారు. నాయకులు వెంకటస్వామి, దేవరాజులు, సుధాకర్ తదితరులు ఉన్నారు.