నిరసన సెగ
చంద్రబాబుకు అడుగడుగునా ఆటంకాలు
ఎమ్మార్పీఎస్ నిరసనల మధ్య ఏపీ సీఎం పర్యటన
సభావేదిక దగ్ధం.. టీడీపీ కార్యాలయానికి నిప్పు..
ఎమ్మార్పీఎస్ నాయకులను చితకబాదిన పోలీసులు
నిరసనలో ఏపీ, కుప్పం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
హన్మకొండ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డారుు. అండగా నిలిచిన తమను మోసం చేశారంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయకుండా వరంగల్‌లో గురువారం పర్యటించడంపై నాయకులు మండిపడ్డారు. హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ సభావేదికకు గురువారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో నిప్పంటించారు. ఈ ఘటనలో దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగగానే సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పారు. ఆ వెనువెంటనే వేదికను పునరుద్ధరిం చారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ, కాజీపేట మీదుగా చంద్రబాబు హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని అదాలత్ వద్దకు రాగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డంగా రోడ్డుపై పడుకున్నాడు. జేబులో నుంచి దండోరా జెండా, నల్ల జెండాను తీసి నిరసన తెలిపారు. పోలీసులు స్పందించి ఎమ్మార్పీఎస్ కార్యకర్తను తొలగించి కాన్యాయ్‌ని ముందుకు పోనిచ్చారు. కాన్వాయ్ మందుకు కదలగానే ఎమ్మార్పీఎస్ మహిళ కార్యకర్తలు నల్ల జెండాలు, ఎమ్మార్పీఎస్ జెండాలతో గుంపుగా కాన్యాయ్‌కి అడ్డంగా వచ్చారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాన్వాయ్‌ను అడ్డుకోబోతున్నారని ముందే తెలుసుకొన్న పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దీనికి తోడు న్యాయవాదులు రెండు హైకోర్టులు ఏర్పాటుపై చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించాలని నిరసన తెలిపారు. కరీంనగర్ ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరంతర నిఘా.. అరుునా ఆగని నిరసనలు
అదాలత్, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం, డీసీసీబీ ఆవరణ, కోర్టు వెనుక, పక్క ప్రాంతాల్లో నిరతంరం పోలీ సులు నిఘా పెట్టారు. పోలీసులు మఫ్టీలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను గమనిస్తూ ఉన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అయినా చంద్రబాబుకు పర్యటనకు ఆటంకం తప్పలేదు. ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయూనికి నిప్పంటించారు. ఈ సంఘటనలో ప్లాస్టిక్ కుర్చీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. నిప్పంటించిన టీ డీపీ కార్యాలయంల ఎంఎస్‌ఎఫ్, దండోరా అని రాసి ఉన్న జెండాను వదిలి వెళ్లారు. టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న వారు వెంటనే మంటలు ఆర్పారు. అదే వి ధంగా కాజీపేటలో ఫ్లెక్లీ తగులబెట్టారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ తోరణాలను దగ్ధం చేశారు. చంద్రబాబు సభకు ఆటంకాలు ృసష్టించవద్దని టీడీపీ నాయకులు కోరినా పట్టుదలకు పోయారు. అనుకొన్నట్లుగానే నిరసన తెలిపారు.
బుధవారం నుంచి అజ్ఞాతంలోకి..
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు ఉంటాయని భావించిన ఎమ్మార్పీఎస్, అనుబంధసంఘాల నాయకులు, కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. వర్గీకరణపై ప్రకటన చేయకుంటే నిరసన తెలుపాలని నిర్ణయానికి వచ్చిన ఎమ్మార్పీఎస్, అదే పట్టుదలతో ఆచరణలో చూపింది. నిరసన తెలుపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ప్రధానంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఇక్కడికి కార్యకర్తలు వచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుధవారం రెండుసార్లు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి వర్గీకరణపై చంద్రబాబు ప్రకటన చేయాలని, ఆ పార్టీ నాయకులు చేయించాలని డిమాండ్ చేశారు. అయితే ఎలాంటి ప్రకటన చేయకుండా బాబు జిల్లాకు రావడంతో ఎమ్మార్పీఎస్ నిరసనలు చవిచూశారు. పోలీసులకు తారసపడ్డ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పలు చోట్ల పోలీసులు చితకబాదారు. కాజీపేటలో పోలీసుల చేతిలో గాయపడ్డ సురేందర్ అనే కార్యకర్త వరంగల్ గార్డియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.