సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో బుధవారం నుంచి వచ్చే నెల 6 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపడంతోపాటు విధులకు విఘాతం లేకుండా రోజుకు గంటో, అరగంటో ధర్నాలు చేయాలంటూ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన అఖిల సంఘాల సమావేశం పిలుపునిచ్చింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా జరిగిన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జాతీయ, ప్రాంతీయపార్టీల నేతలను కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి సహకరించమని కోరతారు.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండా కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన అంశాలు, ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం విఫలమైం దని, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రప్రజల్ని వంచించిందని అభిప్రాయపడింది. ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాలని తీర్మానించింది. హోదాకోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, అన్నివర్గాల ప్రజలు ఒకే తాటిపైకొచ్చి పోరాడాలని పిలుపిచ్చింది.
పోరాట కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు మరలా విస్తృతస్థాయిలో అన్నిపక్షాలతో, సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈలోగా వచ్చే పదిరోజుల్లో రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్రానికి నిరసన తెలపాలని నిర్ణయించింది. మరిన్ని గంటలు అదనంగా పనిచేయడం ద్వారా జపాన్ తరహా నిరసన తెలియచేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రస్తుత సమావేశానికి హాజరుకాని వైఎస్సార్‌సీపీ, జనసేనలను ఒక మెట్టు దిగయినా వచ్చే సమావేశానికి ఆహ్వానించాలని, అందుకు సీఎం చొరవ చూపాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు సూచించినట్టు తెలిసింది.
వచ్చే సమావేశంలో విద్యార్థులు, విద్యుత్, ఇతర సంఘాల్నీ భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించారు. సమావేశానికి ప్రభుత్వ ఉద్యోగ, వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రత్యేక హోదా సాధన సమితి, జర్నలిస్టు సంఘాలు హాజరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment