
చంద్రబాబు రైతు ద్రోహి..!
► రైతు మహా ధర్నాలో...వైఎస్సార్ సీపీ నాయకులు
► సుజయ్ కృష్ణ రంగారావు...
► ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా...
పార్వతీపురం: చంద్రబాబు రైతు ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ఆర్‌కే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. సోమవారం పార్వతీపురంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ తేడా చూపిస్తూ రైతులను అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. పండగ సమీపిస్తున్న తరుణంలో కూడా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
పండిన పంటను సైతం అమ్ముకోలేని దౌర్భాగ్యంలో టీడీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఓవైపు వర్షం భయం, మరో వైపు అగ్గి భయాలతో పొలాలు, కళ్లాల్లో పంటను కాపలా కాయలేక మంచు, చలికి రైతన్నలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ రైతు పక్షపాతి
టీడీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ ఎదిరించి పోరాడుతుందన్నారు. భవిష్యత్‌లో రైతుల పట్ల ప్రభుత్వం ఇదే పరిస్థితి కనబరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కార్యక్రమంలో జమ్మాన ప్రసన్నకుమార్‌తోపాటు ఆ పార్టీ నాయకులు ప్రసంగించారు. రైతు సంఘం, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి, బంటు దాసు తదితరులు సభా ప్రాంగణానికి వచ్చి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్ సీపీ మహా ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వంగపండు ఉష, మజ్జి వెంకటేష్, గర్భాపు ఉదయభాను, బోను రామినాయుడు, సాలా హరిగోపాల్, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఆర్వీఎస్ కుమార్, వలిరెడ్డి జగదీష్, గుర్రాజు, జొన్నాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.