
చిన్న రాష్ట్రానికి సీఎంనయ్యా: బాబు
పరిధి తగ్గిపోయి పని లేకుండా పోయింది: ఏపీఎన్జీవోల సన్మాన సభలో సీఎం చంద్రబాబు
విజయవాడ బ్యూరో: ‘‘నేను 23 జిల్లాలకు సీఎంగా వున్నప్పుడు చేతినిండా పని ఉండేది. ఇప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి సీఎంగా ఉండటం వల్ల పరిధి తగ్గిపోయి పెద్దగా పనిలేకుండాపోయింది. సమయం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని విషయాలు అందరితో మాట్లాడే అవకాశం కలిగింది’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు జరిపిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవిని కొందరు బంగారు పీఠమనుకుంటారని, కానీ అది ముళ్ల కిరీటమని అన్నారు. రాష్ట్రంలో అన్నీ సమస్యలేనని, హైదరాబాద్ సెక్రటేరియెట్‌లో పనిచేసే పరిస్థితి కూడా లేదని అన్నారు. రాష్ట్రాన్ని సీమాంధ్ర అంటున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్‌గా నిజమైన బ్రాండ్‌నేమ్ ఉందని, దాన్నే కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచంలో అందరూ చూడ్డానికి వచ్చే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్మించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోకి ఎటు రావాలన్నా 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని, అందుకే సెంటర్‌ప్లేస్ నుంచి పరిపాలన చేసే విషయమై ఆలోచిస్తున్నానని తెలిపారు. ఏదేమైనా ఆగస్టు ఆఖరులోగా రాజధాని ఎక్కడో తేలుతుందని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా
ఉద్యోగుల సమస్యల్లో ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో మూడు నెలలకోసారి ఆయా శాఖల మంత్రులు, అధికారులు సమావేశమై సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ప్రకటించారు. ఉద్యమం నిర్వహించిన 80 రోజులను లీవ్‌గా పరిగణించి సర్వీసును రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. హెల్త్‌కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ఆగస్టు 15 నుంచి ఇన్సూరెన్స్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. పీఆర్సీ ఎప్పుడు చేయడానికైనా తాను సిద్ధమేనన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. పదవీ విరమణ వయసు పెంపును టీచర్లకూ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను సమీక్షించి ఇబ్బంది పడేవారికి అండగా ఉంటామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా చనిపోయిన 25 మంది ఉద్యోగులు, బయట వ్యక్తులు ముగ్గురికి రూ.5 లక్షల చొప్పునసాయం చేస్తామన్నారు.
సంక్షేమ పథకాలకు ఒకరోజు వేతనం: అశోక్‌బాబు
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇక్కడున్న 4 లక్షల మంది ఉద్యోగుల ఒకరోజు బేసిక్ జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. దీనిద్వారా వచ్చే రూ.80 కోట్లను ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్ల పథకాలకు ఉపయోగించాలని కోరారు. హైదరాబాద్‌లో పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, 36 వేల మంది ఉద్యోగులు ఇక్కడికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను ఘనంగా సన్మానించారు.
ఇక మిమ్మల్ని పరిగెత్తిస్తా..
ఇదిలా ఉండగా విజయవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అది కార్యకర్తల కృషేనని,కార్యకర్తలకూ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇకమీదట విజయవాడలో ఎక్కువ రోజులు ఉంటానన్నారు ఇంతకాలం తాను పరిగెత్తితే మీరంతా కూర్చున్నారని, ఇకమీదట తాను కూర్చుని మిమ్నల్ని పరిగెత్తిస్తానని చెప్పారు.