
చంద్రబాబు ఇంటి మరమ్మతులకు అరకోటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నివాసముంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లోని అద్దె ఇంటికి రూ.అరకోటికి పైగా కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుదీకరణ పనుల కోసం రూ.35 లక్షలు, అద్దె ఇంటిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పనుల కోసం రూ.20.85 లక్షలు కేటాయించారు. జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి మొత్తం రూ.55.85 లక్షలు కేటాయిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఆదేశాలిచ్చారు.
ఇంతకు ముందే ఈ అద్దె ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దె ఇంటికి ఏప్రిల్‌లో మారారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న అద్దె ఇంటికి సీసీటీవీల ఏర్పాటు, సోలార్ పవర్ ఫెన్సింగ్ కోసం రూ.67.50 లక్షలు, కొన్ని విద్యుత్తు పనుల కోసం రూ.6 లక్షలు కలిపి మొత్తం 73.50 లక్షలు అప్పట్లో ఖర్చు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోనే ప్రెస్ షెడ్ల నిర్మాణానికి రూ.7.60 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. ఇప్పటికే రూ.81.10 లక్షలు, ప్రస్తుతం కేటాయించిన రూ.55.85 లక్షలు కలిపి మొత్తం అద్దె ఇంటికి రూ.1.36 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారన్న మాట.