
'చంద్రబాబు యాత్ర విహార్ యాత్రను తలపిస్తోంది'
హైదరాబాద్: తుపాను ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్ర విహార్ యాత్రను తలపిస్తోందని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎర్ర తివాచీలను పరుచుకుని రైతులను ఓదార్చడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బాబు తీరును దుయ్యబట్టారు. కార్పెట్లపై పూలు చల్లించుకుని చంద్రబాబు పొలాలకు వెళ్లడం రైతుల బాధలు పట్టవనడానికి నిదర్శనమని గండ్ర అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఓటు రాజకీయాలు చేయడమే తప్పా, ప్రజా సమస్యలు పట్టవని ఆయన మండిపడ్డారు. ఆయన ఏం చేసినా ఓట్లు-సీట్లు కోసమే చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ అని గండ్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులను ఎత్తి వేయాలని జీవోఎంకు లేఖ రాశామన్నారు.