
రాజీలేని పోరాటం చేస్తా: చంద్రబాబు
రాష్ట్ర విభజన విషయంలో అందరికీ న్యాయం జర గటంతోపాటు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకూ రాజీలేని పోరాటం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిన తీరును ఆయన తప్పుపట్టారు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సభలో బిల్లును సీఎం, స్పీకర్ నిబంధనలను ఉల్లంఘించి ప్రవేశపెట్టారని ఆరోపించారు. తనను మాట్లాడాల్సిందిగా శాసనసభ ఉప సభాపతి పిలవ డమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్, అధికారులపై దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలని, ఆ ఘటనలో మరణించిన అధికారుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క నెలలోనే 120 కోట్ల విలువైన ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగితే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు అడిగేది.
1. విభజన బిల్లు సభలో ప్రవేశపెడతారని తెలిసినా మీరు ఆ సమయానికి ఎందుకు సభకు రాలేదు?
2. అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడానికి నిర్వహించిన బీఏసీ సమావేశానికి సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ మీరెందుకు హాజరుకాలేదు?
3. రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి మీరిచ్చిన లేఖ అలాగే ఉంది. దాన్ని ఉపసంహరించుకోకుండా లేదా కొత్తగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేఖ రాయకుండా ఇతర విషయాలపై మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుందా?
4. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో కేసు వేస్తే వెంటనే మీ పార్టీ నాయకులతో పిటిషన్ వేసి ఇంప్లీడ్ అయిన మీరు అదే శంకర్రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఆయన సోదరులకు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని కోర్టును ఆశ్రయించినప్పటికీ మీరెందుకు స్పందించడం లేదు. జగన్ విషయంలో ఒకతీరు మిగిలిన వారి విషయంలో మరో తీరు వ్యవహరించడంలో ఆంతర్యమేంటి?