ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గుంటూరు బస్టాండు వద్ద మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వీలుంటే ఏపీఎస్ ఆర్టీసీని ఏ కేశినేనికో, దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే రేషనలైజేషన్ పేరుతో కాలేజిలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం మూయించేస్తున్నారని తెలిపారు. కాస్త వీలుంటే వాటిని నారాయణకు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఇంకా కొద్దిగా వీలు కనిపిస్తే చంద్రబాబు ఏపీ జెన్‌కోను, ట్రాన్స్‌కోను కూడా సీఎం రమేష్‌కో, సుజనా చౌదరికో అమ్మేయడానికి ఆయన సిద్ధపడతారని, దాంతో కార్మికుల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని వైఎస్ జగన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అందరం కలిసి ఒక్కటై మే ఒకటో తేదీని మేడేగా నిర్వహించుకుంటామని, ఈ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఒక పండుగలా చేసుకుంటామని.. ఏ దేశమైనా కార్మికులమంతా ఒక్కటేనని చెప్పే రోజు ఇదని జగన్ తెలిపారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత తన సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే వీళ్లకూ వెన్నుపోటు పొడిచేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో కార్మికులు, రైతులు చదువుకున్న పిల్లలు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. అంతా కలిసికట్టుగా ఒక్కటై చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాల్సిందిగా పేరు పేరునా కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వైఎస్ జగన్‌కు తమ కష్టాలపై వినతిపత్రం సమర్పించారు.