వేషమూ మార్చమంటారేమో!
సింగపూర్, జపాన్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేస్తున్న చేష్టలకు ఐఏఎస్‌లు విస్తుబోతున్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు వెంటనే ‘30 రోజుల్లో జపనీస్ భాష’ నేర్చుకోవాలని బాబు చెబుతున్నారట. దీంతో రెండు రకాల ఉపయోగాలున్నాయని ఉద్బోధ చేశారట. జపాన్ వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో... తెలుసుకోవడంతో పాటు వారి భాషను మనం గౌరవిస్తున్నామన్న భావన వారిలో కలిగించాలని ప్రభుత్వ కార్యదర్శులకు సుదీర్ఘంగా క్లాసు తీసుకున్నారు. ‘ఏం చేస్తారో.. నాకు తెలియదు.. మీరు నేర్చుకోవాల్సిందే..! జపాన్ వారిని మంత్రముగ్దుల్ని చేయాల్సిందే!’ అని బాబుగారు అధికారులకు గీతోపదేశం చేయడంతో ఇద్దరు ముగ్గురు ముఖ్య కార్యదర్శులు జపనీస్ భాష నేర్చుకునేందుకు కోచింగ్ సెంటర్లు వెతుక్కునే పనిలో పడ్డారు. జపనీస్ భాషను కొండ నాలుకతో మాట్లాడాల్సి ఉంటుందని నిపుణులు చెప్పడంతో ఇన్నే ళ్ల సర్వీసు తర్వాత ఇవేం కష్టాలని తలలు పట్టుకుంటున్నారు. ఇంకా నయం..! వేషం కూడా మార్చాలని చెప్పలేదని కొందరు సరిపెట్టుకుంటున్నారట.