
చంద్రబాబు 420
► సీఎంపై కేసులు నమోదు చేయాలని అన్ని
► నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు
► అనంతపురం టూటౌన్‌లో ఫిర్యాదు చేసిన
► ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపీ అనంత, గురునాథరెడ్డి
► పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఫిర్యాదు
(సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘అధికారం చేపట్టి రెండేళ్లయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్కహామీ చంద్రబాబు నెరవేర్చలేదు. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీతో పాటు ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలిచ్చి అన్నివర్గాలను వంచించారు. చివరకు తన స్వార్థం కోసం ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనబెట్టి ఏకంగా రాష్ట్రాన్నే మోసం చేశారు. కావున సెక్షన్ 420 ప్రకారం సీఎంపై ఛీటింగ్ కేసు నమోదు చేయాల’ని వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఫిర్యాదులు సమర్పించారు. రెండేళ్లపాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసం, ప్రజలు నష్టపోయిన తీరును ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అనంతపురంలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, క్రమశిక్షణకమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రెండేళ్లలో జరిగిన అన్యాయంపై చర్చించారు. అనంతరం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ క్రాంతికుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు వ్యవహారమంతా మోసపూరితమని, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వైఎస్సార్‌సీపీ విజయావకాశాలను దెబ్బతీసినందున ఐపీసీ 415, 420, ప్రజాప్రాతినిథ్యచట్టం- 1951లోని సెక్షన్ 123(4) ప్రకారం ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. పెనుకొండ పోలీసుస్టేషన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వైఖరితో మోసపోని ప్రజలు రాష్ట్రంలో లేరని ఆయన అన్నారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. రెండేళ్లలో చంద్రబాబు ఏస్థాయిలో మోసం చేశారో.. రాబోయే కాలంలో ఇంతకంటే తీవ్రస్థాయిలో మోసగించే అవకాశం ఉందని, కాబట్టి ఆయన వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మడకశిరలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐకు ఫిర్యాదు అందజేశారు. తాడిపత్రిలో సమన్వయకర్త, అదనపుసమన్వయకర్త రమేశ్‌రెడ్డిలు చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తర్వాత జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గంలో మండల కన్వీనర్లు స్థానిక డీఎస్పీ అనిల్‌కు ఫిర్యాదు అందజేశారు. హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు స్థాయిలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి దేశంలో మరొకరు లేరని పుట్టపర్తి సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కదిరిలో పార్టీ సీఈసీ సభ్యుడు సిద్దారెడ్డి, శింగనమలలో నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి, ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాప్తాడులో మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.