కొర్లకుంట గ్రామంలో డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, గాలివీడు : పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన జిమ్మిక్కులు నమ్మవద్దని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గాలివీడు మండలంలోని కొర్లకుంట గ్రామంలోని డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని వేదన చెందారు. ఇప్పుడు పసుపు కుంకుమలతో తమను మోసగిస్తున్నారని వారు వివరించారు. అప్పుడు ఎన్నికల్లో పూర్తి మాఫీ చేస్తామని చెప్పారని, మూలధనం క్రింద ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు కుంకుమ కింద ఇస్తున్న చెక్కులకు ఇంతవరకు తమకు డబ్బులు అందలేదని తెలిపారు. డ్వాక్రా మహిళలను మోసగిస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేమని వారు స్పష్టం చేశారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డ్వాక్రా మహిళల సంక్షేమంపై చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలలులోగా గాలివీడు మండలంలోని అన్ని పల్లెలకు కూడా వెలిగల్లు ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ప్రసాద్‌రెడ్డి, ఖాసీంసాబ్, ఎంపీటీసీ రమణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమాన్‌నాయక్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శేఖర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment