అనంతపురం (అర్బన్) : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కొర్రీలు వేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు విభాగం జిల్లా అధక్షుడు కె. వెంకట చౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి జి. కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు రైతాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
చీఫ్ విఫ్ కాలువ శ్రీనివాసులు అసలు జిల్లాలో అప్పుల బాధతో ఏ ఒక్క రైతు కూడా మరణించలేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడి రైతాంగాన్ని అవహేళన చేశాడన్నారు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, తొలి సంతకం వ్యవసాయ రుణాల పైనే చేస్తానని చెప్పిన చంద్రబాబు అనేక షరతులు విధించి దాన్ని చివరికి రూ. 1 లక్షల 50 లకు కుదించారన్నారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారికిచ్చే పరిహారంలో కూడా చంద్రబాబు అనేక కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు మేము వెనకుండి వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, మహిళ విభాగం జిల్లా కార్యదర్శి కృష్ణవేణి, సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం నాయకులు రిలాక్స్ నాగరాజు, సర్పంచ్ ములి లోక్‌నాథ్‌రెడ్డి, కణేకల్ లింగారెడ్డి, వలిపిరి శివారెడ్డి, సాకే ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.