
భామిని: సాయం కోసం ఎదురు చూస్తున్న దళిత రైతు భార్య, కుమారుడు
సాగు చేయలేకపోయారు. పరిస్థితులు బాగు చేయలేకపోయారు. నిన్నటి అప్పుల భయం, రేపటి రోజుపై బెంగ, ఉన్న పరిస్థితులపై అయోమయం.. వెరసి అన్నదాత ఉసురు తీసుకున్నాడు. వ్యవసాయం చేస్తున్నంత కాలం రైతుకు సహాయ నిరాకరణ చేసిన సర్కారు ప్రాణం పోయాక కూడా ఆ నిర్లక్ష్యాన్ని వదలడం లేదు. బలవంతంగా ఊపిరి ఆపుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం లేదు. భామిని మండలంలో జిల్లాలోనే అధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఎవరికీ సక్రమంగా పరిహారం అందలేదు. కుటుంబ పెద్దను కోల్పోయి వేదన అనుభవిస్తున్న ఆ కుటుంబాలు సాయం అందక మరింత యాతన పడుతున్నాయి.
శ్రీకాకుళం, భామిని: బిడ్డికి కాంతారావు, అల్లాడ ఆనంద్, సవలాపురపు వసంతరావు, మండల రామారావు, కలిశెట్టి మన్మధరావు.. వ్యవ‘సాయం’ లేక ఉసురు తీసుకున్న రైతులు. అంతేకాదు సర్కారు నిర్లక్ష్యానికి నిర్జీవ సాక్ష్యాలు వీరు. భామిని మండలానికి చెందిన ఈ కర్షకులు సాగు చేయలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కానీ సర్కారు మాత్రం వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో తీవ్ర అలసత్వం చూపుతోంది.
సమావేశాల్లో చర్చించినా..
జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సమీక్షలో భాగంగా ఆయా వర్గాలకు చెందిన రైతుల ఆత్మహత్యలూ చర్చకు వచ్చాయి. ఆ కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని ఆదేశాలూ జారీ చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. డీవీఎంసీలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో దళిత, గిరిజన రైతుల ఆత్మహత్యలపై, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడంపై తీవ్రంగానే చర్చించారు. పాలకొండ ఆర్టీఓ, వ్యవసాయ జేడీలకు త్రిసభ్య కమిటీతో పరిశీలనకు ఆదేశాలు వచ్చాయి. కానీ ఇంత వరకు భామిని మండలంలో ఆ రైతు కుటుంబాల పరిస్థితిపై ఎవరూ పరిశీలన చేయలేదు. పరిహారాలూ అందించలేదు. కనీసం ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో కూడా తెలుసుకోలేదు.
పోయిన ప్రాణాలివే..
♦ భామిని మండలం బొడ్డగూడ గిరిజన గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు బిడ్డికి కాంతారావు(42) 2015 ఫిబ్రవరి 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో మొదటి సారిగా అప్పుల బాధతో ఆదివాసీ గిరిజన రైతు చనిపోవడం సంచలనం రేకెత్తించింది. రెండున్నర ఎకరాల్లో పండించిన పత్తి పంట నష్టాలు, వేసిన కొండపోడు జీడి తోటల్లో దిగుబడి రాకపోవడం అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మృత్యుమార్గం ఎంచుకున్నాడు. మృతునికి భార్య కుసుమ, కొడుకు శ్రీనుల నలుగురు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. అధికారులు మృతికి కారణాలు నమోదు చేశారు. ఐటీడీఏతో పాటు ఏ ఇతర శాఖల నుంచి కూడా ఎలాంటి పరిహారం అందలేదు.
♦ మండల కేంద్రంలోని దళిత రైతుల అల్లాడ ఆనంద్(50), 2015 జూన్ 29న ఆత్మహత్య చేసుకున్నారు. తన పూరింటిలోనే పురుగు మందు తాగి చనిపోయారు. కౌలుకు సాగు చేస్తున్న నాలుగు ఎకరాల పత్తి పూర్తిగా దెబ్బతినడం, దిగుబడి గిట్టుబాటు కాకపోవడంతో ప్రాణాలు తీసుకున్నారు. భార్య, నలుగురు కుమార్తెలను వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడు.
♦ మండలం లివిరికి చెందిన మరో దళిత యువ రైతు సవలాపురపు వసంతరావు(34) 2015లో ఆగస్టు 12న బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. కౌలుకు తీసుకున్న రెండున్న ఎకరాల్లో పత్తి సాగు చేసి అప్పుల పాలై పురుగు మందు తాగి చనిపోయాడు. భార్య సుజాత, తల్లి చిన్నమ్మిలు అనాథలైపోయారు. వీరికి సాయం అందలేదు.
♦ సతివాడలో మరో రైతు పురుగు మందుకు ప్రాణాలు అర్పించాడు. రైతు మండల రామారావు(65) 2015 నవంబర్ 27న పురుగుల మందు తాగి మృతి చెందాడు. చెరువు కింంద రెండున్నర ఎకరాల జిరాయితీ భూముల్లో పంటలు పోవడం, కౌలుకు తీసుకున్న ఎకరన్నర భూమిలోనూ వరి పోవడంతో ఉసురు తీసుకున్నాడు. ఇతనికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
♦ బురుజోలకు చెందిన రైతు కలిశెట్టి మన్మధరావు(52) 2015 డిసెంబర్ 18న పురుగు మందు తాగి చనిపోయారు. పది ఎకరాల్లో వేసిన వరి, పత్తి పంటలు పూర్తిగా పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు భూములకు కౌలు శిస్తు కూడా చెల్లించలేకపోయారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు వచ్చి వివరాలు నమోదు చేసినా సాయం అందలేదు.
ఆదేశాలు వచ్చినా..
గత ఏడాది డిసెంబర్ 21న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై చర్చించాం. భామిని మండలంలో బొడ్డగూడ, భామిని, లివిరి గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతుల కుటుంబాలకు కనీస పరిహారాలు అందలేదని తెలిపాం. రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ నియమకానికి డీవీఎంసీ కమిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ డి.ధనంజయరెడ్డి ఆదేశించి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు ఇంత వరకు స్పందించకపోవడం దారుణం. పంటలు పోయి ప్రాణాలు తీసుకున్న రైతులను ఆదుకోవడానికి అధికారులు స్పందించకపోవడం బాధాకరం.
– బోసు మన్మధరావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు, బత్తిలి, భామిని మండలం
Comments
Please login to add a commentAdd a comment