శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబు
Published Fri, Mar 3 2017 6:18 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
► అక్రమ కేసులు దారుణం
► పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్
బంగారుపాళెం: తెలుగుదేశం పార్టీ ఎంపీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శవరాజకీయం చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ విమర్శించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, క్షతగాత్రులను పరామర్శించడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారన్నారు. మృతులకు పోస్టుమార్టం చేయకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంపై అక్కడ అధికారులను ప్రశ్నించిన జగన్‌పై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారికి వైద్యులు తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు మూడుసార్లు ఘోర రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోయారన్నారు. అటువంటి ట్రావెల్స్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందని ఆయన పేర్కొన్నారు.
Advertisement