మోడీ, కెసీఆర్ లకు లేనిది... చంద్రబాబుకు ఉన్నది....
మోడీ, కెసీఆర్ లకు లేనిది... చంద్రబాబుకు ఉన్నది....
Published Wed, Jun 11 2014 12:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
ఒక నాయకుడి బలం తెలుసుకోవాలంటే ఆ నాయకుడిని ఆయన అనుచరులు ఎంత బలంగా నమ్ముతున్నారో తెలుసుకుంటే చాలు. దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కరుణానిధిని ఆయన అనుచరులు విడిచిపోలేదు. జయలలిత అధికారంలో ఉన్నా లేకున్నా ఆమె అనుచరులు ఆమె వెన్నంటే ఉంటారు.
నరేంద్ర మోదీ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పక్కనబెట్టారు. బండారు దత్తాత్రేయ వంటి బలమైన నేతలను పక్కనపెట్టారు. కానీ పార్టీలో ఎలాంటి తిరుగుబాటూ లేదు. అదే విధంగా కొద్ది పాటి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రి వర్గం విషయంలోనూ అసంతృప్తులు ఉన్నా బయటకి రావడం లేదు. ఎవరూ తిరుగుబాటు ప్రకటించలేదు.
అదే చంద్రబాబు విషయానికి వచ్చే సరికి ఆయనకు అసెంబ్లీలో తగినంత బలం ఉంది. కెసీఆర్ తో పోలిస్తే ఆయన పరిస్థితి మరింత సురక్షితం. ఆయనకు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. ఇన్ని ఉన్నా ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తే అసమ్మతి సెగలు ఎందుకు రగులుతున్నాయి? ఎందుకు ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు నిరాహార దీక్షలకు దిగుతున్నారు? ఎందుకు వారు పార్టీ పదవులకు బై చెబుతున్నారు?
ఉత్తరాంధ్రలో ఏడు సార్లు ఎన్నికలు గెలుస్తూ వచ్చిన పతివాడ నారాయణ స్వామి, కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి ఉన్న కళా వెంకటరావు అసంతృప్తితో ఉన్నారు. దాన్ని వారు దాచుకోవడం లేదు. మరో వైపు విశాఖపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు దూతగా వచ్చి బుజ్జగించినా ఆయన మాట వినడం లేదు. తూర్పు గోదావరిలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాజమండ్రిలో మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న కాగిత వెంకట్రావు మధుమేహ వ్యాధి పీడితుడై ఉండీ నిరాహార దీక్ష చేసి, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఇక గుంటూరులోనైతే గత పదేళ్లుగా పార్టీకి నోరుగా పనిచేసిన ధూళిపాళ నరేంద్ర కు మంత్రి పదవి దక్కనందుకు ఆయన అనుచరులు ఆయనను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లవద్దని నిర్బంధించారు. ఇంకోవైపు మోదుగుల అనుచరులు టీడీపీ కార్యాలయంపైనే దాడి చేసి, కసి తీర్చుకున్నారు. అనంతపురంలో పెనుకొండ ఎమ్మెల్యే బీకె పార్థసారధి అనుచరులు పార్టీకి రాజీనామా చేసేశారు.
ఈ తిరుగుబాటు చంద్రబాబు ఊహించి ఉండరా? కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలు, గతం నుంచి వెన్నంటి ఉండిన వారికి మధ్య సయోధ్య ఎందుకు కుదర్చలేదు? పార్టీ నేతలతో ఆయన ముందస్తుగా చర్చించి, బుజ్జగించడానికి ప్రయత్నించలేదా? వారికి వేరే పదవులు ఇస్తామని హామీ ఇచ్చారా లేదా? రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సీమాంధ్రను మళ్లీ పునర్నిర్మించే బాధ్యత ఉన్న నేతగా ఆయన తన లీడర్ షిప్ ను ప్రదర్శించాల్సిన సమయంలో ఎందుకు విఫలమయ్యారు?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన పరిస్థితిలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది. ఇప్పటికే రుణమాఫీ తలకు చుట్టుకుంటోంది. మిగతా వాగ్దానాలూ ఇలాగే ఉండబోతున్నాయా? ప్రస్తుతం ఓటర్లు ఎక్కువకాలం వేచి చూసే మూడ్ లో లేరు. తాము నమ్మి నాయకత్వం, అధికారం కట్టబెట్టిన నేత తప్పటడుగులు వేసినా కొద్దికాలం సహిస్తారేమో కానీ, తప్పుటడుగులు వేస్తున్నారన్న అనుమానం వస్తే చాలు శిక్షించేందుకు రెడీ అవుతారు. కేవలం అయిదులక్షల ఓట్లు ఎక్కువగా వచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశాన్ని శిక్షించేందుకూ వోటర్లు వెనుకాడరు.
Advertisement
Advertisement