సాక్షి, అమరావతి: గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు 600కిపైగా వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించిన సీఎం చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన అనంతరం సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు సరికొత్త హామీలతో మరోసారి మోసగించేందుకు ఎల్లో మీడియా సహకారంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రుణమాఫీని అటకెక్కించిన చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సైతం వెన్నుపోటు పొడిచారని గుర్తు చేస్తున్నారు. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీల భారం అన్నదాతల నడ్డి విరిచిందని, బ్యాంకుల్లో అప్పులు కూడా పుట్టని దుస్థితికి చేరుకోవడానికి బాబు పాలన కారణం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2017 జూలైలో ప్రకటించిన నవరత్నాల హామీలపై ఏడాదిన్నరగా స్పందించకుండా ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు మోసపు సినిమాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఒక్కొక్కటిగా నవరత్నాల హామీలను కాపీ కొడుతున్నారని పేర్కొంటున్నారు.
డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు అప్పు రూపంలో ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం మోసం కాదా?మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతోనే పెన్షన్ పెంచుతున్నట్లు హడావుడిగా ప్రకటన చేయడం వంచన కాదా? ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం మోసం కాదా? వారిని నిజంగానే ఆదుకోవాలనే ఉద్దేశం ఉంటే గతంలోనే పించన్ మొత్తాన్ని ఎందుకు పెంచలేదు? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అదేకోవలో మొన్న 9 గంటల వ్యవసాయ విద్యుత్తు, నిన్న పించన్ల పెంపును చంద్రబాబు ప్రకటించారని స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఏడాదిన్నర క్రితమే వైఎస్ జగన్ ప్రకటించిన పథకాన్ని తాజాగా చంద్రబాబు ఇప్పుడు రైతు రక్ష పేరుతో ప్రవేశపెట్టనున్నట్లు లీకులిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేసే కార్యక్రమాలను ఐదేళ్లుగా ఎందుకు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి కాలం అధికారంలో కొనసాగుతూ ఇలాంటి పలు పథకాలను అమలు చేసే అవకాశం ఉన్నా ఆయన ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
నిన్ను నమ్మం బాబూ నమ్మం..
చంద్రబాబు గత ఎన్నికల సమయంలో కుటుంబానికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడికి తెర తీశారు. రాష్ట్రంలో 1.72 కోట్ల కుటుంబాలు ఉండగా కేవలం కొద్ది మందిని మాత్రమే నిరుద్యోగ భృతికి ఎంపిక చేసుకుని నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తామనడం మోసం కాదా?..అందుకే నిన్ము నమ్మం బాబూ.. నమ్మం అంటూ మండిపడుతున్నారు.
అవకాశం ఉన్నా చేయకుండా ఇప్పుడు ప్రకటనలా?
గతంలో ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించినప్పుడు నాడు అధికారంలో ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం అందుకు పోటీగా తాము రూ.1.90కే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, అవకాశం ఉన్నా ఏమీ చేయకుండా మరోసారి గెలిపిస్తే ఏదో చేస్తామంటూ నవరత్నాల హామీలను కాపీ కొడుతూ చంద్రబాబు ప్రకటనలు చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏడాదిన్నర క్రితమే నవరత్నాల కింద పలు పథకాలను ప్రకటించగా చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటిదాకా మౌనంగా ఉంటూ ఎన్నికల ముందు అవే అంశాలను అమలు చేస్తామని చెప్పడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగుదేశం – మహామోసం.. ఎలక్షన్ సినిమా..
Published Tue, Jan 22 2019 3:28 AM | Last Updated on Tue, Jan 22 2019 1:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment