ముస్లింలపై బాబుది కపట ప్రేమ! | Chandrababu fake love on Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలపై బాబుది కపట ప్రేమ!

Published Mon, Aug 21 2017 4:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ముస్లింలపై బాబుది కపట ప్రేమ! - Sakshi

ముస్లింలపై బాబుది కపట ప్రేమ!

- ఓట్లు, సీట్ల కోసం ఎంతటికైనా తెగిస్తారు
సీఎం చంద్రబాబుపై ముస్లిం ప్రజాప్రతినిధుల మండిపాటు
నాటి ఎన్నికల్లో ముస్లింలకు ఒక్క సీటే కేటాయించారు
మైనార్టీ మంత్రి లేని కేబినెట్‌
చంద్రబాబుదే టీడీపీని నమ్ముకున్న వారిపై చిన్నచూపు
నంద్యాల ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు హామీలు
 
నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం. ఎన్నికల కోసం కులాలను మతాలను ఉపయోగించుకునే అవకాశవాది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇప్పుడు నంద్యాలలో ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారు’’ అంటూ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిని రాజకీయ విశ్లేషకులు కూడా సమర్థిస్తున్నారు.

అవసరమైతే వాడుకోవడం, ఆపై కరివేపాకులా తీసిపారేయడం చంద్రబాబుకు అలవాటేనని వారు చెబుతున్నారు. దీనికి చంద్రబాబు హామీలే రుజువు అని వివరిస్తున్నారు. ఇస్లామిక్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంకు పెట్టి మైనార్టీలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ దాని ఊసేలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకపోగా, హిందూపురంలో అబ్దుల్‌ఘనీకి సైతం అన్యాయం చేశారు.  తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోసం సిట్టింగ్‌ సీటు త్యాగం చేస్తే.. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంచి పదవి ఇస్తానని ఘనీని నమ్మించి మోసం చేశారని వివరిస్తున్నారు. 
 
నారాయణ, లోకేశ్‌కు ఉన్నస్థాయి మైనార్టీలకు లేదా?
ఎలాంటి పదవి లేకపోయినా నారాయణకు మంత్రివర్గంలోకి తీసుకొని ఆపై ఎమ్మెల్సీని చేశారు. లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రి పదవి ఇచ్చారు. ముస్లింలపై నిజంగా ప్రేమ ఉంటే ఒక్క మైనార్టీ సోదరుడినైనా ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఎమ్మెల్సీగా సీనియర్లు మైనార్టీ వ్యక్తులున్నా వారికి మంత్రి వర్గంలోకి తీసుకోలేదు ఎందుకు? దీనిని బట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లిం మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
–  ఎమ్మెల్యే ఎస్‌.మహమ్మద్‌ ముస్తఫా
 
మైనార్టీల ద్రోహి చంద్రబాబు
బీజేపీతో పొత్తు పెట్టుకొని చారిత్రక తప్పిదం చేశాను, మరోమారు తప్పిదం చేయనని 2004లో ప్రకటించిన చంద్రబాబు.. 2014లో మాటతప్పి బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 15 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి, పీలేరులో మాత్రమే ఒక సీటు కేటాయించారు. అదికూడా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం మేరకు మైనార్టీలను చీల్చాలనే ఉద్దేశంతో ఆపని చేశారు. టీడీపీనే నమ్ముకున్న లాల్‌జాన్‌బాష కుటుంబాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఈ మూడున్నర ఏళ్లలో ఇంటర్వ్యూ ఇవ్వని చంద్రబాబు.. నంద్యాలలో ఎన్నికలు కాబట్టే ఓట్ల కోసం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లిం మైనార్టీల ద్రోహి.
– అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే
 
విశ్వాసానికి మారుపేరు ముస్లింలు
మైనార్టీలు మేలు చేసిన వారిని గుర్తుంచుకుంటారు. కీడు చేసిన వారిని మరువరు. అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చేయూతనిచ్చింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకంతో అనేక మంది ముస్లిం ఉన్నత విద్య అభ్యసించారు. ఇప్పటికీ ఆ మహానేత మా ముస్లింల గుండెల్లో ఉన్నారు. 2014లో ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి అభిమానం చాటుకున్నారు. మరోమారు నంద్యాలలో సైతం అదే విశ్వాసాన్ని ముస్లింలు వైఎస్సార్‌సీపీపై తమ ప్రేమను చూపేందుకు సంసిద్ధంగా ఉన్నారు. 
– హెచ్‌.నదీం అహమ్మద్,వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement