టార్గెట్‌ భోగాపురం | Chandrababu Huge Scame in Bhogapuram Airport | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ భోగాపురం

Published Mon, Jul 23 2018 2:23 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Chandrababu Huge Scame in Bhogapuram Airport - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయలు కమీషన్లు కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి అనుకూలంగా అస్మదీయులకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు రూపొందిస్తున్న విధానంలోనే ఈ ఎయిర్‌పోర్ట్‌ పనులను కూడా అప్పగించేందుకు రెడీ అయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది.

ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని కూడా గతంలో దాఖలు చేసిన బిడ్లలో పేర్కొంది. అయితే ఆ సంస్థ నుంచి కమీషన్లు రావని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారు. తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా వ్యూహం పన్నారు. ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా దూరంగా ఉంచవచ్చో అదే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. బిడ్లలో పాల్గొనే సంస్థ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుండాలనే నిబంధన పెట్టడం వెనుక ఏఏఐని నిలువరించే ఉద్దేశం స్పష్టమవుతోంది. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. 

కమీషన్లు రావనే పాత టెండర్లు రద్దు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనాన్షియల్‌ బిడ్లను 2017 ఆగస్టు 21వ తేదీన తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఏఏఐ తెలిపింది. ఈ బిడ్లలో పాల్గొన్న జీఎంఆర్‌ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలని ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సిఫార్సు చేశారు.

అయితే ఏఏఐ నుంచి ముడుపులు, కమీషన్లు రావని ఉద్దేశంతో ముఖ్యనేత.. అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు కూడా తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సూచించడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా బిడ్లను ఆహ్వానించినా ఏఏఐ మళ్లీ పాల్గొంటే తమ లక్ష్యం నెరవేరదని చాకచక్యంగా అర్హత నిబంధనలను రూపొందించారు. ఈ షరతుల ద్వారా బిడ్లలో ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

‘రియల్‌’ వ్యాపారం చేసి ఉంటేనే...
సాధారణంగా ప్రైవేట్‌ సంస్థలైతే వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణాలను చేపట్టి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావటంతో ఏఏఐ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపట్టదు. దీన్ని ఆసరాగా తీసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం బిడ్లలో పాల్గొనే వారు గత పదేళ్లలో 1.50 లక్షల చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంలో వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ఉండాలనే నిబంధన విధించారు. అలాగే కనీసం 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్‌ కమ్‌ వాణిజ్య వ్యాపారం చేసి ఉండాలని, కనీసం 100 ఎకరాల్లో మూడు లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో రెసిడెన్షియల్‌ అండ్‌ టౌన్‌షిప్‌ నిర్మించి ఉండాలనే షరతులను పొందుపరిచారు. ఈ నిబంధనల ద్వారా ఏఏఐని బిడ్లలో పాల్గొనకుండా నిలువరించారని, కావాలనే ఇలాంటి మెలిక పెట్టారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన సంస్థను ఎంపికచేసి పనులు కట్టబెట్టేందుకే ఇలాంటి నిబంధనలను తెరపైకి తెచ్చారని వారు చెబుతున్నారు. 

మూడు దశల్లో పనులు..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలుత 5,311 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించాలని భావించారు. తర్వాత ఒక దశలోనే 2,708 ఎకరాల్లో రూ. 2,461 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించి 2016 జూలైలో బిడ్లను ఆహ్వానించారు. అయితే ఇప్పుడు 3 దశల్లో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు దశలకు నిర్మాణ వ్యయం రూ. 4,209 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశకు రూ. 2,302.51 కోట్లు, రెండో దశకు రూ. 989.58 కోట్లు, మూడో దశ పనులకు రూ. 917.01 కోట్లు వ్యయం అవుతుందని ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పనులను అనుకూల కంపెనీకి అప్పగించి తద్వారా రూ. కోట్లు కొల్లగొట్టడానికి ముఖ్యనేత వ్యూహం పన్నారని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement