
చంద్రబాబు తీరు బాధించింది
సీటు ఉందని, పోటీకి అవకాశమివ్వలేదు సినీ నటి కవిత ఆవేదన
ఐ.పోలవరం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి తీరు తనను బాధించిందని ప్రముఖ సినీనటి కవిత అన్నారు. 2009, 2014 ఎన్నికలలో తాను పోటీ చేసేందుకు సీటు ఉందన్న చంద్రబాబు ఎక్కడా అవకాశమివ్వకపోవడం నిరాశా నిస్ఫృహలకు గురి చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఆమె తన కుమార్తె మాధురితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ మీదున్న గౌరవం, పార్టీ విధానాలపై అభిమానంతో 2007 నుంచి తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నానని చెప్పారు. పోటీ చేసేందుకు ఎక్కడా సీటు ఇవ్వకపోయినా ఐదు జిల్లాల్లో పర్యటించి పార్టీ విజయానికి కృషి చేశానన్నారు. గతంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేసిన తనకు ప్రస్తుతం ఎలాంటి స్థానమూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తారన్న నమ్మకం ఉందని, లేకుంటే చంద్రబాబునే నిలదీస్తానని చెప్పారు. రాష్ట్రం విడిపోవడం బాధాకరమన్నారు.