
రుణమాఫీకి డబ్బుల్లేవ్ తెగేసి చెప్పిన సీఎం చంద్రబాబు
సాక్షి, ఏలూరు:‘రైతులూ.. మీరు తీసుకున్న రుణాలేవీ బ్యాంకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కట్టొద్దు. బంగారంపై తీసుకున్న రుణాలనూ రద్దు చేస్తా. డ్వాక్రా మహిళలూ.. మీరు కూడా పైసా కట్టక్కర్లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తా’ అంటూ ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో మాట మార్చారు. ‘బంగారం తాకట్టు పెట్టి చాలామంది వేరే అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. అలాంటి రుణాల విషయంలో నేనేం చేయలేను’ అంటూ చంద్రబాబు చేతులెత్తేశారు.
రెండు రోజుల పర్యటన కోసం బుధవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోపాలపురం, చింతలపూడి నియోజవర్గాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో లక్ష్మి అనే డ్వాక్రా మహిళ ‘అయ్యా.. బ్యాంకోళ్లు నాలుగు రోజుల్లో లోన్ కట్టమని నోటీసులిచ్చారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు’ అని ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. దేవులపల్లిలో రావమ్మ అనే మహిళ ‘డ్వాక్రా రుణాల సంగతి లేల్చండి. లేదంటే రాత్రికి ఇక్కడే ఉండిపోండి’ అని నిలదీసింది. చంద్రబాబు స్పం దిస్తూ ‘ఎన్నికల ముందు ఉమ్మడి రాష్ర్టంలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాను. కానీ.. ఖజానాలో డబ్బుల్లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు మీ ముందే పెడతా. అప్పులు.. ఖర్చులు.. అన్నీ మీకు చెబుతా. మీరెలా చేయమంటే అలా చేస్తా. అందుకే రుణమాఫీ గురించి మరికొంత సమయం అడుగుతున్నా’ అని చెప్పి తప్పించుకున్నారు.
ఎన్నికల యూత్రలా...
బాబు పర్యటన ఆద్యంతం ఎన్నికల యాత్రను తలపించింది.‘ఇంటికొక్క రుణమైనా రద్దుచేయడానికి ప్రయత్నిస్తాను. వ్యవసాయంలో సాంకేతిక, ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టి లాభసాటిగా మారుస్తా. కొత్తగా పరిశ్రమలు తీసుకువస్తా. పూజారులకు గౌరవ వేతనం ఇస్తా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. టెట్ రద్దుచేస్తా. డీఎస్సీ తీస్తా. స్కాలర్‌షిప్‌లు ఇస్తా. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తా’ అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ వల్లె వేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం తన కృషిగానే బాబు చెప్పుకున్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో ద్వారకాతిరుమల చేరుకున్న ఆయన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దాదాపు అరగంటపాటు పూజలు జరిపారు.
అనంతరం 12గంటలకు దూబచర్ల మీదుగా ద్వారకాతిరుమల వచ్చే రోడ్డులో ఏర్పా టు చేసిన సోలార్ వీధి దీపాలను ప్రారంభించారు. ఆ తరువాత కాపు కల్యాణ మండపాన్ని పరిశీలించి హైస్కూల్ వైపు కదిలారు. అక్కడ కాసేపు ప్రసంగించారు. ద్వారకాతిరుమలలో వైద్యకళాశాల, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలతోపాటు 500 పడకల ఆసుపత్రి వంటివి నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. రూ.5 కోట్ల నుంచి 10 కోట్లను వెచ్చించి ద్వారకాతిరుమలను పట్టణంగా అభివృద్ధి చేస్తానని, జాతీయ రహదారితో అనుసంధానిస్తానని హామీల వర్షం కురిపించారు. అక్కడి నుంచి తాడిచర్ల చేరుకున్న చంద్రబాబు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానిస్తానని రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో అన్నారు.
బెల్టు షాపుల్ని తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని, అవసరమైతే బెల్టుషాపులు నిర్వహించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తానని అన్నారు. అక్కడినుంచి మధ్యాహ్నం 3 గంటలకు కామవరపుకోట చేరుకున్న బాబు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, నెడ్‌క్యాప్, విద్యుత్, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ, సూక్ష్మ సేద్యం వంటి శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిం చారు. అనంతరం రైతు సదస్సుకు హాజరయ్యూరు. పంట దిగుబడి పెంచడానికి భూసార పరీక్షలు చేసి భూమికి కావాల్సిన పోషకాలు అందిస్తామని తెలిపారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తానన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సి వుందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తరుుతే తాడిపూడి పథకం నిరుపయోగం అవుతుందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఆదర్శ రైతులుగా ఉన్నారని, వారిని తొలగించి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసిన వారిని విస్తరణ అధికారులుగా నియమిస్తామని వెల్లడించారు. సదస్సు అనంతరం చంద్రబాబు ఉప్పలపాడు, రావికంపాడు, దేవులపల్లి మీదుగా గుర వాయిగూడెం చేరుకున్నారు. చంద్రబాబు వెంట డెప్యూటీ సీఎం, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, ఎంపీలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, గరి కిపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.