కేసుల కక్ష!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల, సంస్థల ప్రాథమిక హక్కు. అయితే పాలక పక్షాలు తమకు వ్యతిరేకంగా జరిగే నిరసనలకు చట్టాల సంకెళ్లు తొడుగుతున్నాయి. ఉక్కుపాదంతో అణగదొక్కుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమూ ఇదే దుర్నీతికి తెరతీసింది. దండనీతి అవలంభిస్తోంది. రైతుల పక్షాన ఉద్యమించిన ప్రధాన ప్రతిపక్షమైన వైఎఎస్‌ఆర్‌సీపీ గొంతు నొక్కాలని చూస్తోంది.
విషయమేంటంటే..
రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రుణమాఫీకి రకరకాల పరిమితులు విధిస్తోంది. పెండింగులో ఉన్న రుణ బకాయిలకు, రైతులు, డ్వాక్రా మహిళల సంఖ్యకు పొంతన లేనివిధంగా మాఫీ విధానాన్ని ప్రకటించి.. ఇదే గొప్ప అన్నట్లు సంబరాలు చేసుకుంటోంది. సర్కారు తీరు చూసి రైతులు ఆందోళన చెందుతుంటే.. గత కొన్నాళ్లుగా పూర్తిస్థాయి రుణమాఫీకి డిమాండ్ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ రైతన్నలకు మద్దతుగా రోడ్డెక్కింది. ప్రభుత్వం ప్రకటించిన విధానంలో రైతులకు, మహిళలకు న్యాయం జరగదని పేర్కొంటూ ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు ‘నరకాసుర వథ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు, రైతులు కలిసి కదం తొక్కారు. మానవహారాలు నిర్వహించి ధర్నాలు చేయడంతోపాటు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా ఈ కార్యక్రమాలు జరిగాయి.
పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి
ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా వైఎస్‌ఆర్‌సీపీ చేసిన నిరసన కార్యక్రమాలకు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తునకలిసిరావడం చూసి అధికార టీడీపీ నేతల కన్ను కుట్టింది. కడుపు మంట రగిల్చింది. అంతే అధికార మదంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. వారిని రంగంలోకి దించారు. కక్ష తీర్చుకునే రీతిలో అక్రమ కేసులు బనాయింపజేశారు. నిస్సహాయులైన పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లే చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హిరమండలం, పొందూరు, నరసన్నపేట, సంతకవిటి, జి.సిగడాం, ఆమదాలవలస పోలీస్‌స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం తదితరులతో పాటు ఎమ్మెల్యే కంబాల జోగులు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచ్‌లనే తేడా కూడా లేకుండా అందరిపైనా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించారట!
ఇదేమిటీ.. నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తారా అని ప్రశ్నిస్తే.. ప్రజలకు ఇబ్బంది కలిగించినందు, ముఖ్యమంత్రి వంటి నేతల దిష్టిబొమ్మలను వరుసగా మూడు రోజులు దహనం చేసినందుకు కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసుల్లో సెక్షన్ 143 (గుమిగూడి ఉండడం, అక్రమంగా సంఘంగా ఏర్పడడం), సెక్షన్ 341 (ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టించడం), సెక్షన్ 283 (వాహనాల్ని అడ్డంగా పెట్టడం), సెక్షన్ 285 (దిష్టిబొమ్మల్ని కాల్చడం) వంటి అభియోగాలు మోపారు. ఆమదాలవలస పోలీస్‌స్టేషన్లో సుమారు 60మంది పైన, పొందూరులో ఏడుగురిపై, జి.సిగడాంలో ఐదుగురిపై, నరసన్నపేటలో 30మందిపై, సంతకవిటిలో 20 మందిపై కేసులు నమోదు చేశారు.
ఇంతకుముందూ ఇదే వరస
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 16, 17, 18 తేదీల్లో జిల్లాలో పర్యటించారు. చెన్నైలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందిన 23 మంది కుటుంబాలతో పాటు గాయపడినవారి కుటుంబాల్ని పరామర్శించారు. బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. జిల్లా పార్టీ నేతల ద్వారా ఆర్థిక సాయం అందించారు. అయితే జగన్ పర్యటన సమయంలో బాధితులు స్థానికంగా లేకుండా చేసేందుకు జిల్లా టీడీపీ నేతలు, మంత్రి అచ్చెన్నాయుడు కుట్రపన్నారు. జగన్ పర్యటన రోజునే బాధితులకు చెక్కుల పంపిణీ అంటూ హడావుడి చేశారు. తీరా చూస్తే.. వారిచ్చిన చెక్కులు కొన్ని చెల్లకుండా తిరుగు టపాలో వచ్చేశాయి. ఇప్పుడేమో.. రైతుల తరఫున ఉద్యమించిన నేతలపై కేసులు పెట్టించారు. కేసుల నమోదు విషయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ ధ్రవీకరించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో కేసులు నమోదు చేయాల్సిందని ఆయన చెప్పారు.
ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు
-ధర్మాన కృష్ణదాస్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఖరీఫ్ ఆసన్నమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి బ్యాంకర్ల నుంచి స్పష్టత కరువైంది. డ్వాక్రా రుణాల విషయంలో ఆంక్షలు పెడుతున్నారు. అందుకనే పార్టీ అధిష్టానం సూచన మేరకు మూడు రోజుల పాటు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాం. ఆందోళన విషయాన్ని పోలీసులకూ సమాచారం ఇచ్చాం. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. రైతుల నుంచి, జిల్లా ప్రజల నుంచి మా పోరాటాలకు అనూహ్య స్పందన లభించింది. ఇది చూసి ఓర్వలేక, మా పార్టీ అధ్యక్షుడిపైనా, మా పార్టీ పైనా అధికార తెలుగుదేశం పార్టీ చిర్రుబుర్రులాడుతోంది. పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి కేసులు పెట్టించింది.