సభలో ఆందోళనకు దిగిన మధ్యాహ్న భోజనకార్మికులను బలవంతంగా తోసివేస్తున్న పోలీసులు, టీడీపీ వలంటీర్లు
తగరపువలస(భీమిలి): ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్టివలసలో గురువారం నిర్వహించిన ఆత్మీయసభ పలువురి సహనానికి పరీక్షలా మారింది. మధ్యాహ్నం 2.45కు సభతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేస్తారని అధికారులు హడావుడి చేశారు. ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు చేరుకోవడంతో అప్పటికే విద్యార్థులు, డ్వాక్రా మహిళలు విసుగెత్తి పోయారు. చంద్రబాబు ప్రసంగించే సమయానికి సభా ప్రాంగణం బోసిపోయింది. వేసిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఐ హబ్ గురించి చంద్రబాబు మాట్లాడతారని, ఈ అయిదేళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తారని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి మరీ విద్యార్థులను సభకు పంపారు. ఇక డ్వాక్రా మహిళలైతే సభకు వెళ్లకపోతే రుణాలు రావని వెలుగు, మెప్మా అధికారులు చెబితే వచ్చామని వాపోయారు. 300 ఆర్టీసీ బస్సులను గ్రామాగ్రామాలకు పంపించినా సాయంత్రం 4 గంటల వరకు సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలు నిండలేదు. కొన్నిచోట్ల నుంచి పులిహోర ప్యాకెట్, రూ.500 ఇచ్చి తరలించినా సభలో ఉండకుండా వెనుదిరిగారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు.. డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఏడు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు..
సభకు ముందు వేదిక పక్క అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను చంద్రబాబు ఆవిష్కరించారు. అందులో ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ఎపీ టిడ్కో ఆధ్వర్యంలో జీప్లస్ 3 తరహాలో రూ.2,283కోట్లతో 35,899 యూనిట్ల గృహ సముదాయం, పెందుర్తి నియోజకవర్గంలో రూ.14.50కోట్ల ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై 3 మెగావాట్లతో నీటిపై తేలియాడే సౌర ఫలకం, గాజువాక నియోజకవర్గంలో అగనంపూడి వద్ద రూ.54.22 కోట్లతో 85 ఎంఎల్ ఫిల్టరేషన్ ప్లాంట్ ప్రారంభం, పెందుర్తిలో రూ.362 కోట్లతో నిర్మించనున్న స్లూయజ్ ప్లాంట్, రూ.33.50 కోట్లతో వుడా పార్కును అభివృద్ధి, భీమిలి నియోజకవర్గంలో రూ.41.59 కోట్లతో అభివృద్ధి పనులు, ఐ హబ్ నిర్మాణం వంటివి ఉన్నాయి.
భీమిలిలో సమస్యలను ప్రస్తావిస్తూ అనుకున్నట్టుగానే చిట్టివలస జ్యూట్‌మిల్లు లాకౌట్ సమస్యను కలెక్టరు, మంత్రి గంటా శ్రీనివాసరావులు పరిష్కరిస్తారని అన్నారు. భీమిలిలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. బీచ్‌రోడ్డు అభివృద్ధి పనులకు 23 రోజులలో టెండర్ పనులు పూర్తవుతాయన్నారు. చిట్టివలస చెరువు బ్యూటిఫికేషన్ పనులకు రూ.3కోట్లు కేటాయించామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ఇనాం భూములు, పంచ గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని ముగించారు.
అసహనంతో ఊగిపోయిన చంద్రబాబు
చంద్రబాబు సభలో ప్రసంగిస్తున్నప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగడంతో అసహనం ప్రదర్శించారు. ‘మీరుండండి అనవసరంగా మాట్లాడితే ఊరుకోను... దురుద్దేశంతో సభకు వచ్చారు.. నేనే ఏది చెబితే అదే వినాలి.. గొంతెమ్మ కోర్కెలు తీర్చలేను’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా కూడా కరెక్టు కాదని రుసరుసలాడారు. దీంతో పోలీసులు, వలంటీర్లు మధ్యాహ్న భోజన కార్మికులను బలవంతంగా కూర్చోబెట్టారు.
అనకాపల్లి నుంచి ఉదయమే వచ్చాం
కళాశాలకు మెయిల్ పెడితే ఉదయం 10 గంటలకు వచ్చాం. మధ్యాహ్నం భోజనాలు లేవు. అందుకే సాయంత్రం నాలుగున్నర వరకు చూసి వెళ్లిపోతున్నాము.–అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల విద్యార్థులు
వైస్ ఛాన్సలర్ నుంచి లెటర్ వచ్చింది
చిట్టివలసలో ముఖ్యమంత్రి సభకు రావాలని వైస్ చాన్సలర్ కళాశాలకు లెటర్ పంపితే మధ్యాహ్నం 2.30కు వచ్చాం. ఆకలేస్తే మా కళాశాల అధ్యాపకులే భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది ఈ సభ మాకు పనికిరాదని. అందుకే తిరిగి వెళ్లిపోతున్నాం.–విశాఖ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు, నరవ
ఐ హబ్ గురించి వివరిస్తారంటే వచ్చాం
ఐ హబ్ గురించి ముఖ్యమంత్రి వివరిస్తారని కళాశాలలో చెబితే మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు వచ్చాం. నాలుగున్నర వరకు వేచి ఉన్నాం. ఇక వేచి చూసి అవసరం లేదని వెళ్లిపోతున్నాం. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. చాలా ఇబ్బందులు పడ్డాం.– విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు
రెండేళ్లుగా పింఛను నిలిపేశారు..
నాకు 73 ఏళ్లు. రెండేళ్ల క్రితం వరకు వృద్ధాప్య పింఛను వచ్చేది. భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. కుమారుడు బుద్ధి మాంధ్యంతో బాధ పడుతున్నాడు. వృద్ధాప్యపు, వితంతు పింఛన్లకు అర్హురాలినే.. కానీ ఎందుకో భీమిలి జోన్ అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. దీంతో ఈ వయసులో పాచిపని చేసుకుని జీవిస్తున్నాను.–సబ్బి అప్పయ్యమ్మ, సంగివలస,భీమిలి జోన్
Comments
Please login to add a commentAdd a comment