ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వేలు చంద్రబాబునాయుడు
టైటిల్ : ఎమ్మెల్యే..
ట్యాగ్‌లైన్ : మంచి లక్షణాలు గల అబ్బాయి..
సరిగ్గా ఇదే పేరుతో మన జిల్లాకు చెందిన సినీ స్టార్ డెరైక్టర్ ఓ బడా హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీయాలని కొన్నాళ్ల క్రితం తలపెట్టారు. ఎందుకో తెలీదుగానీ.. ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే జిల్లాలో మంచి లక్షణాలు గల అబ్బాయిలు.. అదేనండీ ఎమ్మెల్యేలు ఎవరనే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా సర్వే చేయించారట.
అధికారం చేపట్టి వంద రోజుల పూర్తయిన నేపథ్యంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనా ప్రత్యేక సర్వేలు చేయించారని చెబుతున్నారు. మంత్రులు ఈ మూడు నెలల్లో శాఖల పరంగా సాధించిన ప్రగతిపై నివేదికలు సమర్పించారు. ఆయా శాఖల పనితీరుపై బాబు తన వేగుల ద్వారా కూడా సర్వే చేయించి.. ఈ రిపోర్టులతో మంత్రులిచ్చిన నివేదికల్ని పోల్చి గ్రేడింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రేడింగ్‌ల్లో మన మంత్రులకు వచ్చిన మార్కులు ఎన్ని..? అనే విషయమై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తాజాగా మంత్రులతోపాటు జిల్లాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందన్న అంశంపైనా చంద్రబాబు ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకున్నారట.
మరోవైపు టీడీపీ వ్యవహారాల్లో షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ప్రైవేటుగా సర్వేలు చేయిం చారని అంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుఎలా ఉంది, పార్టీ విషయంలో నిబద్ధత, ప్రజాసమస్యలపై అవగాహన ఎలా ఉన్నాయి.. తదితర ప్రశ్నలతో సర్వే చేయించారని చెబుతున్నారు. ఈ సర్వేల్లో జిల్లాకు చెందిన చాలామంది ఎమ్మెల్యేలకు కేవలం అత్తెసరు మార్కులే వచ్చాయని అంటున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలకైతే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలను ఉద్దేశిస్తూ సుమారు 25 ప్రశ్నలపై వివిధ వర్గాల నుంచి సమాధానాలు తీసుకున్న క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రవర్తన, వివాదాస్పద వ్యవహార శైలి చర్చకు వచ్చినట్టు తెలిసింది.
గోటితో పోయేదానికి గొడ్డలి వరకు..
న్యాయ వ్యవస్థపై అనవసర వ్యాఖ్యలు చేసి కోర్టుమెట్లెక్కి ఆనక క్షమాపణలు చెప్పిన ఓ ప్రజాప్రతినిధి నిర్వాకంపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. గోటితో పోయే వ్యవహారానికి అధికార మదంతో గొడ్డలివరకు తెచ్చుకున్న వైనం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం బాబు ఎన్ని క్లాసులు ఇచ్చినా ఓ ఎమ్మెల్యే దుందుడుకు వైఖరిలో ఇసుమంతైనా మార్పు రాలేదన్న అంశంపైనా ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. చీటీకీ మాటికీ అధికారులపై అంతెత్తున లేవడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం వంటి చిల్లర వ్యవహారాలతో సదరు నేతకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని అంటున్నారు.
ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పాత వాసనలు పోకుండా సెటిల్‌మెంట్లు, భూకబ్జాల దందాలతోనే దాగుడుమూతలు ఆడుతున్న ఓ ప్రజాప్రతినిధి వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. మరో సీనియర్ ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఎవరితోనూ సఖ్యత లేకుండా సాగిస్తున్న ఒంటెత్తు పోకడలపైనా చర్చ జరిగిందని అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పార్టీ వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న నిర్వాకమూ ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒకాయన తీరు అధికారులనే కాదు సొంత పార్టీ కార్యకర్తలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ఎవరు వెళ్లి ఏ పని అడిగినా చేద్దాం.. చూద్దాం అంటూ కాలయాపన తప్ప ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోవడం లేదన్న తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్నారని సర్వేలో తేలిందట.
మరో సీనియర్ ప్రజాప్రతినిధి.. రెండోసారి ఎన్నికయ్యాను జాగ్రత్త అంటూ అధికారులను తీవ్రంగా ఒత్తిళ్లకు గురిచేస్తూ ఈ విషయంలో తన సహచర ఎమ్మెల్యేతో పోటీపడుతున్నారని అంటున్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందో విశ్లేషించి మార్కులు వేసేందుకు సర్వే చేయిస్తే ఇలా రి‘మార్కు’లు రావడం చూసిన పార్టీ అధినేత సంగతేమో గానీ.. ఈ ఫలితాలను చూసి సర్వేరాయుళ్లు మాత్రం తలలు పట్టుకున్నారట.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు