
ఎర్రచందనం స్మగ్లర్ల పని పట్టండి
విజయవాడ: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నూరు శాతం అరికట్టేలా అటవీ, పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎర్రచందనం దొంగలు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్-1967ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ చట్టానికి ఇటీవల చేసిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి మార్గం సుగుమమైందని అన్నారు. ఎర్రచందనం అక్రమంగా నిల్వ చేసిన వారిపై, దొంగతనంగా తరలించే వారిపై కొత్త సవరణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయాలని చెప్పారు.
బుధవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎర్రచందనం చెట్ల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. 100 బేస్ క్యాంపులను సిద్ధం చేయడంతో పాటు, 127 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తనిఖీ కేంద్రాల దగ్గర వెహికల్ స్కానర్లతో, ఇంకా ఇ-సర్వైలెన్స్‌తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్, డ్రోన్ల సాయంతో స్మగ్లర్లను కట్టడి చేయగలిగామని అన్నారు. ఎర్రచందనం విస్తరించిన 1,267 కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వామన్నారు. అలాగే ఫీల్డ్ స్టాఫ్‌కు వెపన్స్ అందిస్తున్నామని, రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు అటవీ శాఖలో ప్రస్తుతం వున్న 231 ఖాళీల భర్తీకి అనుమతితో సహా, అదనంగా నియామకాలకు మరో 701 పోస్టులను మంజూరు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 5,83,523 హెక్టార్లలో వున్న ఎర్రచందనాన్ని మరింత విస్తరించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎర్రచందనం మొక్కల పెంపకం కోసం తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, ఔషధ గుణాలపైనా పరిశోధన చేయాలని చెప్పారు. రైతులు ఎర్రచందనం పెంచేలా ప్రోత్సహించాలని అన్నారు. మరోవైపు ఎర్రచందనం వేలానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వెలువడనుంది.
ప్రతిష్టాత్మకంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఈనెల 29న చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి మరోసారి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు.