Sandalwood smugglers
-
ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు
-
గొడ్డళ్లతో పోలీసులపై స్మగ్లర్ల దాడి
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు–చిత్తూరు జిల్లాల మధ్య అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నేలకూల్చి.. వాటి దుంగల్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి వాహనాలను దూకించి.. గొడ్డళ్లు, బరిసెలు విసిరి వారిని చంపేందుకు యత్నించారు. ఆ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పోలీసులు అతి కష్టంపై ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులతోపాటు 55 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. రూ.17.38 లక్షలు విలువైన 45 ఎర్రచందనం దుంగలను, ఓ లారీని, ఓ కారును, రూ.75,230 నగదు, 31 సెల్ఫోన్లు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2 రంపాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో.. ఈ ఘటనకు సంబంధించి వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో జిల్లా ఎస్పీ సీహెచ్.విజయారావు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరెగ్రాముకు చెందిన దాము అనే వ్యక్తికి ఆయిల్ ట్యాంకర్లు ఉండేవి. నష్టాల పాలైన దాము వాటిని అమ్మేశాడు. ఆ తరువాత తనవద్ద డ్రైవర్ పనిచేసిన తమిళనాడులోని వేలూరుకు చెందిన కుప్పన్ సుబ్రహ్మణ్యంతో కలిసి 5 నెలల క్రితం పాండిచ్చేరికి చెందిన ఎర్రచందనం దుంగల స్మగ్లర్ పెరుమాళ్లు వేలుమలైను కలిశాడు. తాను ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తానని చెప్పడంతో వేలుమలై తన బావమరిది రాధాకృష్ణ పళనిని వారికి పరిచయం చేశాడు. వీరంతా కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నరికి అక్రమంగా తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ నెల 20న పాండిచ్చేరి నుంచి 55 మంది తమిళ కూలీలు లారీలో తీసుకొచ్చారు. దాము, పళని, సుబ్రహ్మణ్యం కారులో వారికి ఎస్కార్ట్‌గా గూడూరు చేరారు. అక్కడ వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన చంద్రశేఖర్‌ను కలిశారు. చంద్రశేఖర్ అక్కడి నుంచి వారందరినీ రాపూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కూలీలు ఎర్రచందనం వృక్షాల్ని నేలకూల్చారు. దీనిపై ఎస్పీ సీహెచ్ విజయారావుకు పక్కా సమాచారం అందటంతో ఆయన ఆదేశాల మేరకు ఈ నెల 21న పోలీసులు రాపూరు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలించారు. పోలీసుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు అప్పటివరకు నరికిన ఎర్రచందనం దుంగలను పోలీసుల కంటపడకుండా లారీలో ఉంచి ఈ నెల 22న అటవీ ప్రాంతం నుంచి బయలుదేరారు. పోలీసుల్ని చంపేందుకూ వెనుకాడని దుండగులు పోలీసులు నిందితుల కోసం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. చిల్లకూరు మండలం బూదనం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. దీనిని గమనించిన స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో పోలీసుల్ని ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లారీలోని తమిళ కూలీలు గొడ్డళ్లను పోలీసులపైకి విసిరి వారిని చంపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా ఆటకట్టు
అనంతపురం క్రైం: శేషాచలం అడవుల నుంచి చెన్నై, శ్రీలంక మీదుగా చైనాకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ బాయి ముఠా గుట్టును హిందూపురం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ఇటీవల చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో హిందూపురం రూరల్ సీఐ హమీద్‌ఖాన్, చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువ చేసే 3,305 కిలోల 165 ఎర్రచందనం దుంగలతోపాటు ఐదు వాహనాలు, 19 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించి 21 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 19 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 8 మంది తమిళనాడు, ఐదుగురు వైఎస్సార్ జిల్లా, ఆరుగురు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. దుబాయ్, కొలంబో వేదికగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చెన్నయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ హమీద్ అలియాస్ సాహుల్‌భాయ్ కీలక నిందితులు. బిలాల్ శ్రీలంక రాజధాని కొలంబోలో, సాహుల్‌భాయ్ దుబాయ్‌లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. వీరిద్దరూ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి, దుంగలను తమిళనాడులోని తిండివనం తరలించి గోదాముల్లో నిల్వ చేసేవారు. అక్కడి నుంచి చెన్నయ్, శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు తరలించి భారీగా సొమ్ము చేసుకునేవారు. సాహుల్‌భాయ్‌పై వైఎస్సార్ జిల్లాలో 45, తిరుపతిలో సుమారు 40 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. బిలాల్‌పై వైఎస్సార్ జిల్లాలో 10 కేసులున్నాయి. ప్రస్తుత కేసులో పోలీసులు సాహుల్‌భాయ్‌ని ఏ–12గా, బిలాల్‌ను ఏ–13గా చేర్చారు. వీరిద్దరికీ ముఖ్య అనుచరుడైన కామేష్‌బాబు (కార్బైడ్ కాలనీ, కొడుంగైయూర్, చెన్నయ్) సహా 19 మంది పోలీసులకు చిక్కారు. కామేష్‌బాబుపై వైఎస్సార్ జిల్లాలో 16 కేసులు, తిరుపతిలో సుమారు 15 కేసులున్నాయి. ఇతనితో పాటు తిరుపతికి చెందిన జె.గురువయ్య, ఎం.జ్ఞానేంద్ర ప్రసాద్ (మురుగానపల్లి), ఇ.పునీత్‌కుమార్ (గిరింపేట), బి.రాకేష్ (చిత్తూరు), జులపాల సుబిరమని కొట్టి (కేవీబీ పురం), వినోద్‌కుమార్ గాంధీ (చెన్నయ్), తంగదురై రాజుకుమార్ (చెన్నయ్), కె.రవి (పల్లతుర్), ఎస్.కమలేష్ కుమార్ (తెన్పల్లిపట్టు), కుమార్‌బాబు (తిరువళ్లూరు), వైఎస్సార్ జిల్లాకు చెందిన నంద్యాల రామకృష్ణారెడ్డి, అంబరపు ఓబులేసు (మిట్టపల్లి), బోయిని రామనరసింహులు (ఉప్పరపల్లి), బిజివేముల జయసుబ్బారెడ్డి (బద్వేలు), పిచ్చిపాటి శ్రీనివాసులరెడ్డి (బొగ్గడివారిపల్లి), ఏనుగుల కేశవరెడ్డి (అన్నవరం, చాపాడు మండలం), అనంతపురం జిల్లా సోమన్నపల్లికి చెందిన కాకర్ల రామచంద్ర, నెల్లూరు జిల్లా నందిమలకు చెందిన సర్వాది ప్రసన్నకుమార్ కూడా పోలీసులకు చిక్కారు. -
రాళ్లతో దాడికి తెగబడి.. కాల్పులు జరిపేందుకు..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. టాస్క్ ఫోర్స్ పోలీసుల అప్రమత్తతతో వారంతా పరారయ్యారు. తిరుపతి శేషాచలం అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడుకు చెందిన సుమారు 25 మంది స్మగ్లర్లు తిరుపతిలోని కరకంబాడి రోడ్‌లోని అటవీ ప్రాంతం నుంచి ఫారెస్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లాక వారం రోజుల పాటు వారికి తినేందుకు సరిపడా ఆహారాన్ని కూడా వెంట తెచ్చుకున్నారు. నిత్యావసర వస్తువులతో సహా వచ్చిన వ్యాన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అయితే పోలీసులను గుర్తించిన స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు ఒకదశలో కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నించటంతో స్మగ్లర్లు అక్కడనుంచి పరారయ్యారు. (నెల్లూరు జిల్లాలో పెను విషాదం) వారు పరారైన ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న 75 కిలోల బియ్యం, కందిపప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. -
ఎర్రస్మగ్లర్లు ఉన్నట్టా.. లేనట్టా?
చిత్తూరు, వైఎస్సార్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో ఏ గ్రేడ్ ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. దీనికి విదేశాల్లో విశేష డిమాండ్ ఉంది. దీంతో స్మగ్లర్లు కొండలు, కోనలు దాటి ఎర్రచందనం దుంగలను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం అటవీశాఖకు సహాయంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే అటవీ శాఖలో శాశ్వత ఉద్యోగులు 400 మందికి పైగా ఉన్నారు. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధిత శాఖల అధికారుల విభిన్న ప్రకటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరుపతి అర్బన్: శేషాచలం అడవుల్లో ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్ల తాకిడి ఎక్కువగా ఉంటోంది. కరోనా లాక్డౌన్ కారణంగా కూలీలు, స్మగ్లర్లు శేషాచలం అడవులను వదిలిపెట్టి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. లాక్డౌన్ సడలింపులతో మళ్లీ విజృంభిస్తున్నారు. పది రోజులుగా మళ్లీ తమిళనాడు నుంచి ఎర్రస్మగ్లర్లు గుంపులుగా శేషాచలం అడవుల్లోకి వచ్చారని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఒక్క స్మగ్లర్‌నూ పట్టుకోలేదు. 50 మంది స్మగ్లర్లను గుర్తించామని, వారు రాళ్ల దాడులు చేసి పరారయ్యారని అధికారులు తెలిపారు. లాక్డౌన్ ముందు తమిళ స్మగ్లర్లు డంపింగ్ చేసిన ఎర్రదుంగలను కొత్తగా పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వాదన మరోలా ఉంది. బీట్, సెక్షన్ ఆఫీసర్లతోపాటు డీఆర్ఓలు, ఎఫ్ఆర్ఓలు, ఔట్సోర్సింగ్ సిబ్బంది నిత్యం అడవుల్లో సంచరిస్తూన్నారని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాత ఒక్క స్మగ్లర్ కూడా అడవుల్లోకి వెళ్లలేదని పేర్కొంటున్నారు. ఇలా రెండు శాఖల అధికారులు విభిన్న ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది. అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్టా.. లేక ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా నిరోధించారా అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ స్మగ్లర్ల గుంపులున్నాయి తమిళ స్మగ్లర్లు వారం పది రోజులుగా శేషాచలం అడవుల్లో గుంపులుగా చేరారు. అడవుల్లో కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడులు చేస్తున్నారు. చంద్రగిరి సమీపంలోని భీమవరం క్రాస్ ఫారెస్ట్‌లో 30 మంది ఎర్రస్మగ్లర్లు మా వాళ్లపై దాడులు చేశారు. మా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో స్మగ్లర్లు పరారయ్యారు. 34 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ రూ.1.5 కోట్లపైమాటే. తమిళ్ల స్మగ్లర్లు కోవిడ్–19ను సైతం లెక్కచేయకుండా శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. అందులో సందేహం లేదు.–రవిశంకర్, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ, తిరుపతి -
బెడిసికొట్టిన తమిళ స్మగ్లర్ల వ్యూహం
సాక్షి, తిరుపతి: తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతోన్న శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాల భక్తుల రద్దీని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న తమిళ స్మగ్లర్ల వ్యూహం బెడిసికొట్టింది. గురువారం భక్తుల ముసుగులో ఎర్ర చందనం ఉన్న వాహనానికి పూజలు చేయించి తిరుమల నుంచి తమిళనాడుకు బయలు దేరారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో.. అలిపిరి చెక్ పాయింట్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికి పోయారు. పోలీసులు నలుగురు తమిళ స్మగ్లర్లతో పాటు వాహనాన్ని సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎర్రకూలీలు పట్టుబడిన వాహనంలో ఎర్ర చందనాన్ని గతంలో ఐదుసార్లు తరలించారు. -
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ గానుగపెంట బీటులోని కత్తిబండ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు బద్వేలు ఎఫ్ఆర్ఓ పి.సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఫారెస్టు బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గానుగపెంట బీటు సమీపంలోని కత్తిబండ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించగా కొందరు స్మగ్లర్లు తారసపడ్డారన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన బేరిగురప్ప, పట్టణంలోని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన కొండేటిరమణయ్యలు దొరికారన్నారు. అట్లూరు మండలం చలమగారిపల్లెకు చెందిన గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, పట్టణంలోని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన మడమకుంట్ల నాగార్జున, పోరుమామిళ్ల మండలం రేపల్లెకు చెందిన అనకర్ల ప్రకాష్, ఏసిపోగు కిరణ్, ఏసిపోగు వెంకటేష్, అనకర్ల ప్రభాకర్, సోమిరెడ్డిపల్లె జయరాజ్‌లతో పాటు బద్వేలు మండలం బాలాయపల్లెకు చెందిన నాగిపోగు కల్యాణ్‌లు పరారయ్యారని తెలిపారు. వీరందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న 426.5 కేజీల దుంగల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డీఆర్ఓ జి.సుబ్బయ్య, ఎఫ్‌బీఓలు మునెయ్య, జాకీర్‌హుస్సేన్, రామసుబ్బారెడ్డి, నారాయణస్వామి, సుధాకర్, ఏబీఓ అక్బర్‌షరీఫ్‌లు పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల పని పట్టండి
విజయవాడ: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నూరు శాతం అరికట్టేలా అటవీ, పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎర్రచందనం దొంగలు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్-1967ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ చట్టానికి ఇటీవల చేసిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి మార్గం సుగుమమైందని అన్నారు. ఎర్రచందనం అక్రమంగా నిల్వ చేసిన వారిపై, దొంగతనంగా తరలించే వారిపై కొత్త సవరణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయాలని చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎర్రచందనం చెట్ల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. 100 బేస్ క్యాంపులను సిద్ధం చేయడంతో పాటు, 127 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తనిఖీ కేంద్రాల దగ్గర వెహికల్ స్కానర్లతో, ఇంకా ఇ-సర్వైలెన్స్‌తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్, డ్రోన్ల సాయంతో స్మగ్లర్లను కట్టడి చేయగలిగామని అన్నారు. ఎర్రచందనం విస్తరించిన 1,267 కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వామన్నారు. అలాగే ఫీల్డ్ స్టాఫ్‌కు వెపన్స్ అందిస్తున్నామని, రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు అటవీ శాఖలో ప్రస్తుతం వున్న 231 ఖాళీల భర్తీకి అనుమతితో సహా, అదనంగా నియామకాలకు మరో 701 పోస్టులను మంజూరు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,83,523 హెక్టార్లలో వున్న ఎర్రచందనాన్ని మరింత విస్తరించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎర్రచందనం మొక్కల పెంపకం కోసం తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, ఔషధ గుణాలపైనా పరిశోధన చేయాలని చెప్పారు. రైతులు ఎర్రచందనం పెంచేలా ప్రోత్సహించాలని అన్నారు. మరోవైపు ఎర్రచందనం వేలానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రతిష్టాత్మకంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఈనెల 29న చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి మరోసారి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు. -
స్మగ్లర్లను వదిలి... కూలీల కోసం...
సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రకూలీల కాల్చివేత ఘటన వివాదస్పదంగా మారిన నేపథ్యంలో మృతులతోపాటు మిగిలిన ఎర్రకూలీలను చందనం స్మగ్లర్లుగా నిరూపించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన అంతర్రాష్ట్ర వివాదంగా మారడం, హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ముఖ్యంగా తమిళ తలనొప్పిని తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులను రంగంలోకి దింపింది. పోలీసులు అధికార పార్టీకి చెందిన బడా చందనం స్మగ్లర్లను వదిలి తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపెట్టేందుకు స్వరం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు కూలీల వద్ద దొరికిన ఫోన్ సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి సంబంధించిన ప్రధాన స్మగ్లర్ల పాత్ర బయటపడినట్లు సమాచారం. అధికారపార్టీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్మగ్లర్ల వివరాలను గోప్యంగా ఉంచి, ముందు ఎన్కౌంటర్ వివాదం నుంచి బయటపడేందుకు తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపేందుకు రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా తమిళనాడుకు చెందిన కూలీల వివరాలను సేకరించి వారందరినీ స్మగ్లర్లుగా చూపించేందుకు ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన సీఐడీ పోలీసుల బృందం తమిళనాడులో గాలింపు చర్యలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తమ వద్దనున్న ఆధారాలతో తమిళ కూలీలే స్మగ్లర్లంటూ తమిళనాడు ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు పోలీసులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. తమిళ కూలీలను శేషాచలం అడవుల్లోకి రప్పించడంలో జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లు కీలకపాత్ర పోషించారని, వారిని తప్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని ఓ పోలీసు అధికారే స్వయంగా చెప్పడం విశేషం. స్మగ్లర్ల ప్రోద్భలంతోనే అధికారులపై తిరుగుబాటు గతంలో ఎర్రకూలీలు అటవీ, పోలీసు అధికారులపై స్మగ్లర్ల ప్రోద్భలం, భరోసాతోనే దాడులకు పాల్పడినట్లు కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. స్మగ్లర్ల వెన్నుదన్ను లేకపోతే అధికారులపై దాడి చేసే ధైర్యం కూలీలకు లేదని వారు పేర్కొంటున్నారు. ఎర్రకూలీలు వారం రోజులు అడవిలో ఎర్రచందనాన్ని నరికితే అన్ని తామే చూసుకుంటామంటూ స్మగ్లర్లు రూ.30 నుంచి 50 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అటవీ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన ఎర్రకూలీలకు స్మగ్లర్లు ప్రోత్సాహకాల కింద ఒక్కొక్క కూలీకి రూ.10 నుంచి 15వేలు ముట్టజెప్పినట్లు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్చేసిన ఓ నేత ‘సాక్షి’కి వివరించారు. ఈ ఆనవాయితీని చాలా మంది స్మగ్లర్లు కొనసాగించారని, అందుకే ఎర్రకూలీలు అధికారులపై దాడులకు దిగారని ఆయన వివరించారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసుల్లో ఆందోళన మృతిచెందిన ఎర్రకూలీల కుటుంబసభ్యులు ఆదివారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కాల్చివేతలో పాల్గొన్న టాస్క్ఫోర్సు పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. శేషాచలం కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు మృతిచెందిన నేపథ్యంలో ఈ తరహా కేసులను స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల కింద పరిగణిస్తారు. డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు మాత్రమే ఇలాంటి కేసులు దర్యాప్తు చేయాల్సిఉంది. ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలను అధికారులు వెలుగులోకి తేవాలి. హత్యకేసు కింద దర్యాప్తు ప్రారంభిస్తే మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటన స్థలం వరకు ప్రతి ఘట్టాన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డు చేయాలి. ప్రాథమికంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌పోర్సు బలగాల పూర్తి వివరాలతో పాటు వారు వినియోగించిన ఆయుధాలను మొదట స్వాధీనం చేసుకోవాలి. కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనలు పాటించారా...? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు, ఏ తూటా వల్ల చనిపోయారు..? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది..? ఆ తుపాకీని ఉపయోగించింది ఎవరు..? అనేది తేల్చాలి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్ని నిర్ధారించి నమోదు చేయాల్సిఉంటుంది. దీంతో పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
కేబీఆర్ పార్క్‌లో స్మగ్లర్లు అరెస్ట్
-
కేబీఆర్ పార్క్‌లో స్మగ్లర్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్‌లో ఐదుగురు గంధం స్మగ్లర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... గత రాత్రి కేబీఆర్ పార్క్‌లోని గంధం చెట్లను ఐదుగురు స్మగ్లర్ల నరికివేస్తుండగా... అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు చాకుచక్యంగా వ్యవహారించి ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్మగ్లర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. గత కొంతకాలంగా కేబీఆర్ పార్క్‌లో గంధపు చెట్లు అపహరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్క్ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం రాత్రి ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌లో దాదాపు 200 గంధపు చెట్లు ఉన్న సంగతి తెలిసిందే.